చర్చికి నిప్పు…

–  లోపలి గోడలపై మతపరమైన రాతలు
– మధ్యప్రదేశ్‌లో ఘటన
భోపాల్‌: కొందరు దుండగులు చర్చిలోకి ప్రవేశించి దాడి చేయటమేకాక.. దానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో చర్చిలోని ఫర్నిచర్‌, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. అక్కడితో ఆగని అగంతకులు లోపలి గోడలపై మతపరమైన రాతలు రాశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపినవివరాల ప్రకారం… గిరిజనులు ఎక్కువగా నివసించే నర్మదాపురం జిల్లా చౌకీ పురా గ్రామంలో క్రైస్తవ ప్రార్థనా మందిరం ఉంది. ఐదేళ్ల కిందట నిర్మించిన ఈ చర్చి వద్దకు ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వచ్చారు. కిటికీ తెరిచి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. మరి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. చర్చి లోపలి గోడలపై ‘రామ్‌’ అని హిందీలో రాశారు. సోమవారం ఉదయం ఈ దారుణ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వివాదస్పద ఘటన
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో మరో వివాదస్పద సంఘటన చోటుచేసుకున్నది. ఒక ముస్లిం వ్యక్తి ఇంట్లోకి కొందరు బలవంతంగా చొచ్చుకొచ్చారు. ఆ ఇంట్లో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడకు చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేయటంతోపాటు.. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ వివాదానికి ప్రధాన నిందితుడు హిందూ నాయకుడు రవి అవద్‌ అని పోలీసులు తెలిపారు.

Spread the love