సచార్‌ కమిటీ కీలక సిఫారసులు తొలగింపు!

–  ఈవోసీ కమిషన్‌ అవసరం లేదని మోడీ సర్కార్‌ నిర్ణయం
– ద టెలిగ్రాఫ్‌ ఆన్‌లైన్‌..వార్తా కథనం
న్యూఢిల్లీ : ముస్లిం మైనార్టీల విషయంలో మోడీ సర్కార్‌ మరో వివాదాస్పద నిర్ణయానికి తెరలేపింది. దేశంలోని ముస్లింల సమగ్ర అభివృద్ధికి ఏర్పాటుచేసిన సచార్‌ కమిటీ ప్రతిపాదించిన కీలక సిఫారసులను తొలగించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. సచార్‌ నివేదికలో అత్యంత కీలకమైన ఈవోసీ (ఈక్వల్‌ ఆపార్చునుటీస్‌ కమిషన్‌) సిఫార్సును తొలగించాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది. రాజకీయంగా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ముస్లిం మైనార్టీలకు సమాన అవకాశాలు కల్పించేం ఉద్దేశంతో సచార్‌ కమిటీ ‘ఈవోసీ’ అనే సూచన చేసింది. మైనార్టీల కోసం జాతీయ మైనార్టీ కమిషన్‌ ఉండగా, ప్రత్యేకించి సచార్‌ కమిటీ ప్రతిపాదించిన ‘ఈవోసీ’ అవసరం లేదని, దీనిని తొలగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతున్నట్టు ‘ద టెలిగ్రాఫ్‌ ఆన్‌లైన్‌’ వార్తా కథనం పేర్కొంది. గత గురువారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ పెండింగ్‌ బిల్లులు, ఇతర హామీలకు సంబంధించిన 79వ నివేదికను లోక్‌సభ ముందుంచింది. ‘సచార్‌ కమిటీ’పై మధ్యంతర స్థాయి మంత్రిత్వశాఖల సంప్రదింపులను నివేదికలో వివరించారు. ‘ఈవోసీ’ ఏర్పాటుపై పలు మంత్రిత్వ శాఖలు విముఖత వ్యక్తం చేశాయని, సానుకూలంగా స్పందించలేదని, కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర హోంశాఖ వ్యతిరేకించాయని నివేదికలో తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే..సచార్‌ కమిటీ ప్రతిపాదనలు, సూచనలు అంతా అటకెక్కినట్టే. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేందర్‌ సచార్‌ నేతృత్వంలో 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీని నియమించారు. కమిటీ 2006లో 403 పేజీల నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో భారత్‌లోని ముస్లింల సమగ్ర అభివృద్ధికి పలు సూచనలు, పరిష్కారాలను ప్రతిపాదించింది. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక, ‘ఈవోసీ’ చట్టబద్ధమైన సంస్థగా పేర్కొంటూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లుకు 2014 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అయితే అదే ఏడాది 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అప్పట్నుంచీ ఈ బిల్లు పెండింగ్‌లో ఉండిపోయింది.

Spread the love