Postal Ballot: ఈ నెల 9 వరకు అవకాశం : సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

నవతెలంగాణ – విజయవాడ: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సుమారు 70 శాతం పూర్తయిందన్నారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి మరో రోజు గడువు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. సొంత నియోజకవర్గాల పరిధిలో ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఒంగోలులో కొందరు ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు గుర్తించామని, కొందరు తమకు ఆఫర్‌ చేసిన మొత్తాన్ని తిప్పి పంపారన్న విషయం కూడా వెల్లడైందని వివరించారు. ఒంగోలులో ఆన్‌ లైన్‌ ద్వారా డబ్బులు పంపుతున్న వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్‌ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. పల్నాడులో హౌలోగ్రామ్‌ ద్వారా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని..మా దృష్టికి వచ్చిందని.. ఈ ఘటనపైనా విచారణ చేపడుతున్నామని చెప్పారు.

Spread the love