హైకోర్టు సీజేకు వీడ్కోలు

నవతెలంగాణ హైదరాబాద్‌
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు హైకోర్టు ఫుల్‌ కోర్టు గురువారం వీడ్కోలు చెప్పింది. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవల్ని కొనియాడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో ఆయనకు వీడ్కోలు తెలిపింది. భూయాన్‌ను హైకోర్టు న్యాయవాదుల సంఘం కూడా ఘనంగా సత్కరించింది. జస్టిస్‌ భూయాన్‌ దంపతులను జస్టిస్‌ నవీన్‌రావు దంపతులు సత్కరించారు. భూయాన్‌ శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త సీజేగా మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలక్‌ అరధే (కర్నాటక హైకోర్టు జడ్జిగా పని చేస్తున్నారు) నియమితులయ్యారు. కొత్త సీజే వచ్చే వరకు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ నవీన్‌రావు శుక్రవారం విధులు నిర్వహిస్తారు. అదే రోజు ఆయన రిటైర్‌ అవుతారు. ఆ వెంటనే యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి బాద్యతలు స్వీకరిస్తారు.
హైకోర్టుకు లోకేష్‌కుమార్‌ హాజరు
లహైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సినీ హీరోలు వెంకటేష్‌, రానా, నిర్మాత సురేష్‌ బాబుకు నందకుమార్‌లకు చెందిన వివాదాస్పద భూమి విషయంలో బలవంతపు చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశించినా ఆ భూమిలోని కట్టడాన్ని కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ స్థలానికి సంబంధించిన వివాదం సివిల్‌ కోర్టులో పెండింగ్‌లో ఉందనీ, నందకుమార్‌ నిర్వహిస్తున్న డెక్కన్‌ కిచెన్‌ విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోద్దనే ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు కిచెన్‌ను కూల్చివేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లో డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌(నందకుమార్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారించారు. విచారణకు పూర్వపు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హోదాలో లోకేష్‌ కుమార్‌ విచారణకు స్వయంగా హాజరయ్యారు. తెలియక కూల్చివేత చర్యలు తీసుకున్నామన్న ఆయన జవాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేత చర్యలు తీసుకోరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తెలియదా? అని ప్రశ్నించింది. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణకు కూడా హాజరుకావాలని ఆయనతోపాటు ఇతర అధికారులను ఆదేశించింది.

Spread the love