బాల్కొండ నియోజకవర్గంలో రూ.వందల కోట్ల స్కాం

– అందులో మంత్రి ప్రశాంత్‌రెడ్డి హస్తం
– రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక సీఎం కేసీఆర్‌ : ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బాల్కొండ నియోజకవర్గంలోని క్వారీలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనీ, ఈ విషయంపై హైకోర్టుకు, నియోజకవర్గప్రజలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి జవాబు చెప్పాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ క్వారీ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని సీజ్‌ చేయించిందని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అర్వింద్‌ మీడియాతో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలోని బట్టాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీ, క్రషర్‌ను నడుపుతున్నారనీ, దానికి పర్యావరణ అనుమతులు లేవని చెప్పారు. క్రషర్‌ అటవీశాఖ భూమిలో ఉందని చెప్పారు. అనుమతుల్లేకుండా అక్కడ రోడ్లు వేశారన్నారు. అక్కడ నుంచి కంకరను ఆర్‌అండ్‌బీ శాఖ కొన్నదని తెలిపారు. ఆ క్వారీ నిర్వాహకుడైన జీవస్టోన్‌ ఇండిస్టీస్‌ అధినేత వంశీరెడ్డి మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సోదరుడు అవుతారని తెలిపారు. ఆ క్వారీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిదే అని ఆ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారన్నారు. ఆ క్వారీ కరెంటు బిల్లు రూ.51 లక్షలకుపై ఉందనీ, డియర్‌ జగ్గూ(మంత్రి జగదీశ్‌రెడ్డి) దాన్ని ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. వంశీరెడ్డి మీద మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలకు ఎందుకంత ప్రేమని నిలదీశారు. ఆ క్వారీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో కేంద్రం నిధులతో పలు అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర నిధులతో అని శిలాఫలకాలు వేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్‌ ఇంకోసారి అంటే దవడ పండ్లు రాలగొడ్తానని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ.100 కోట్లతోనే సిరిసిల్ల చుట్టూ రింగు రోడ్డు వేసుకున్నారన్నారు. సిద్దిపేట ఆస్పత్రికి వంద కోట్ల రూపాయలను హరీశ్‌రావు మళ్లించుకుపోయాడని ఆరోపించారు. ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక కేసీఆర్‌ హస్తం ఉందనీ, కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌పార్టీకి కేసీఆర్‌ డబ్బులు పంచుతున్నాడని ఆరోపించారు. అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆరే అనీ, ఎన్నికలు అయిపోగానే వారంతా కేసీఆర్‌ వైపు వెళ్తారని విమర్శించారు.

Spread the love