వర్షాకాలం జాగ్రత్తలు తీసుకోండి

– ద.మ.రైల్వే జీఎమ్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సురక్షిత పని పరిస్థితులు, రైలు కార్యకలాపాల రిజిస్టర్ల సరైన నిర్వహణతోపాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో జోన్‌ పరిధిలోని విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజన్ల డివిజనల్‌ రైల్వే మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్క్‌సైట్‌లో భద్రతా అవసరాలను తప్పకుండా పాటించాలని చెప్పారు. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సిగల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌, ఆపరేటింగ్‌, ఇంజినీరింగ్‌ వంటి అన్ని విభాగాలతో కలిసి నెల రోజులపాటు చేపట్టిన సేఫ్టీ డ్రైవ్‌ను కూడా ఆయన సమీక్షించారు. రైలు కార్యకలాపాలకు సంబంధించిన రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. రుతుపవన జాగ్రత్త చర్యలను చేపట్టాలని చెప్పారు. పర్యవేక్షకులు క్షేత్రస్థాయి కార్యచరణను నిరంతరం సమీక్షిస్తూ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. లోకో పైలట్‌లు, రన్నింగ్‌ సిబ్బంది పని వేళలను పరిశీలించారు. ‘ఒక స్టేషన్‌ ఒక ప్రొడక్ట్‌’ స్టాల్స్‌ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు.

Spread the love