18 నుంచి భారత్‌ గౌరవ్‌టూరిస్ట్‌ రైల్‌ ప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘భారత్‌ గౌరవ్‌’ రైలు ఈనెల 18న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. దీన్ని ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) నడుపుతున్న మొదటి టూరిస్ట్‌ రైలు అని చెప్పారు. బుధవారంనాడిక్కడి రైల్‌నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు పేరును ‘పుణ్యక్షేత్ర యాత్ర: పూరీ-కాశీ-అమోధ్య’గా నామకరణం చేశామన్నారు. ఈరైలు రెండు తెలుగురాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ప్రయాణీకులు ఎక్కేందుకు, దిగేందుకు ఆగుతుందని చెప్పారు. చారిత్రక పుణ్యక్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవాలని వారికి ఇదో గొప్ప అవకాశం అని అన్నారు. ఈ యాత్ర మార్చి 18 నుంచి 26 వరకు 8 రాత్రులు, 9 పగలు సాగుతుందన్నారు. పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ వంటి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను కవర్‌ చేస్తుందని వివరించారు. ప్రయాణం, వసతి, ఆహారం సహా అన్నింటినీ సమకూరుస్తూ ప్యాకేజీల రూపంలో ఈ సేవల్ని అందిస్తున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. మొత్తం సీట్లు 700 కాగా, వాటిలో 460 స్లీపర్‌, త్రీటైర్‌ ఏసీ 192, టూ టైర్‌ ఏసీ 48 సీట్లు ఉంటాయని వివరించారు. సమావేశంలో ఏజీఎమ్‌ పీ ఉదరుకుమార్‌రెడ్డి, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం అభరుకుమార్‌ గుప్తా, ఐఆర్‌సీటీసీ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ పీ రాజాకుమార్‌ పాల్గొన్నారు.

Spread the love