ఎంసెట్‌ రాతపరీక్షలు ప్రారంభం

– తొలిరోజు 91.79 శాతం హాజరు
– పరిశీలించిన ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించే ఎంసెట్‌ రాతపరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణలో 95, ఏపీలో 18 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. తొలిరోజు 57,578 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 52,855 (91.79 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇందులో ఉదయం నిర్వహించిన మొదటి విడతకు 26,198 (91.33 శాతం) మంది హాజరయ్యారు. మొదటి విడతకు 2,488 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో విడతకు 28,892 మంది దరఖాస్తు చేస్తే, 26,657 (92.26 శాతం) మంది పరీక్ష రాశారు. రెండో విడతకు 2,235 మంది గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీకి వచ్చి విద్యార్థులు రాస్తున్న పరీక్షలను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి పరిశీలించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ, ఎంసెట్‌ చైర్మెన్‌ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కో కన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి, కోఆర్డినేటర్లు కె భాస్కర్‌, టి మాధవికుమారి పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. గురువారం ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం పరీక్ష జరగనుంది. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలను నిర్వహిస్తారు.
ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థినిలు
స్టాన్లీ ఇంజినీరింగ్‌ కాలేజీ కేంద్రానికి ముగ్గురు విద్యార్థినిలు బుధవారం ఆలస్యంగా వచ్చారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో వారిని పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. ఎంసెట్‌ రాతపరీక్షలను పరిశీలించడానికి వచ్చిన లింబాద్రిని ఆ విద్యార్థినిలు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశారు. వెంటనే ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌కు ఫోన్‌ చేసి ఈ విద్యార్థినిలకు ప్రత్యామ్నాయం చూడాలంటూ లింబాద్రి సూచించారు. ఆ తర్వాత డీన్‌కుమార్‌ను సంప్రదించాలంటూ ఆ విద్యార్థినిలకు ఆయన సూచించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు ఎంసెట్‌ కన్వీనర్‌ కార్యాలయంలో సంప్రదిస్తే అవకాశముంటే వారికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు.

Spread the love