దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరగాలి

Receipt of applications should be transparent– అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశాలు
– కమిషనర్‌ కార్యాలయంలోనూ కేంద్రం ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరగాలని, రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా దరఖాస్తు చేసుకోవడానికి ఆయా జిల్లాలతో పాటు, హైదరాబాద్‌లోని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దరఖాస్తుల సమర్పణలో ఎవరైనా సిండికేట్‌గా ఏర్పడినా, ఎవరినైనా అడ్డుకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరగాలని, అందరికీ అవకాశాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారికి, సహకరించే వారిపై గట్టి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దష్టి సారించి ఎక్కడైతే తక్కువ దరఖాస్తులు వస్తున్నాయో పరిశీలించాలని అదేశించారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మద్యం దుకాణాల దరఖాస్తుకు కుల ధ్రువీకరణ పత్రం, ఏజెన్సీ సర్టిఫికెట్‌ లేకపోతే సెల్ఫ్‌ అఫిడవిట్‌లను అంగీకరించాలని అధికారులను సూచించారు. దరఖాస్తు చేయడంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, దరఖాస్తుదారులకు సమాచారం కావాలన్నా వెంటనే స్థానిక ఎక్సైజ్‌ శాఖ అధికారులను సంప్రదించాలని, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004252523ను సైతం సంప్రదించాలని శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆ జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌, సిమెంట్‌, ఫార్మా, వస్త్ర తదితర వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వివరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీ, జాయింట్‌ కమిషనర్‌ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్లు డేవిడ్‌ రవికాంత్‌, హరికిషన్‌, సహాయ కమిషనర్‌లు చంద్రయ్యగౌడ్‌, శ్రీనివాస్‌, ఈఎస్‌లు సత్యనారాయణ, రవీందర్‌రావు, అరుణ్‌కుమార్‌, విజయ భాస్కర్‌గౌడ్‌, విజరు, పవన్‌కుమార్‌, టీఎస్‌బీసీఎల్‌ ఉన్నతాధికారులు సంతోష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love