కృష్ణమూర్తి సేవలు ఉద్యమకారులకు ఆదర్శం

– దృఢసంకల్పంతో కమ్యూనిస్టు ఉద్యమానికి కృషి : ‘ఉద్యమపథంలో నా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణలో వక్తలు
పలాస(శ్రీకాకుళం) : కమ్యూనిస్టు ఉద్యమ కృషికి సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పాతిని కృష్ణమూర్తి మచ్చుతునక అని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కృష్ణమూర్తి 80వ జన్మదినోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి జీవిత చరిత్ర ‘ఉద్యమపథంలో నా జ్ఞాపకాలు’ పుస్తకాన్ని, ప్రజాశక్తి వెలువరించిన జన్మదిన ప్రత్యేక సంచికను ఏపీ రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్‌ బి.తులసీదాస్‌, సీపీఐ(ఎం) శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిం దరావు తదితరులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా సామాజిక స్పృహతో పాటు సమాజాన్ని మార్చాలన్న దృఢ సంకల్పంతో పనిచేసిన కమ్యూనిస్టు అని కొనియాడారు. ప్రజా, సామాజిక సమస్యలపై నిరంతర పోరాటం సాగించేవారని తెలిపారు. ఉపాధ్యాయులు, రైతులు, కూలీల సమస్యలపై పోరాటం చేయడమే కాదని… ప్రజాప్రతినిధులు, అధికారులను ఒప్పించి, మెప్పించి సాధించుకునేవారని చెప్పారు. ఉపాధ్యాయునిగా ఎంతోమందిని విద్యావంతులను చేశారని, కమ్యూనిస్టుగా ఎంతోమంది ఉద్యమకారులను తీర్చిదిద్దారని తెలిపారు. బెందాళం గవరయ్య, గానుగుల తరుణాచారి, మార్పు పద్మనాభం మరికొంతమందితో కలిసి రైతుసంఘం ఏర్పాటు చేసి మందస జమిందారు ఉద్యమంలో పోరాడారని గుర్తుచేశారు. పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారని ప్రచారం జరిగినా, జైలు జీవితాన్ని గడిపారు తప్ప పోలీసులకు లొంగిపోలేదన్నారు. మామిడిపల్లిలో ఉద్యమ పున:నిర్మాణంలో కృష్ణమూర్తి కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. 1999 ఎన్నికల్లో సోంపేట సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని పార్టీ కోరినప్పుడు గెలుపోటములను చూడకుండా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి పోటీ చేశారని చెప్పారు. మామిడిపల్లి సర్పంచ్‌గా రెండుసార్లు ఎన్నికై ప్రజలకు సేవ చేశారన్నారు. అనంతరం కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. కృష్ణమూర్తి తనయుడు నరేంద్ర వర్మ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఏపీ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, పిరియా రాజారావు, ఎంపీపీ నిమ్మాన దాసు, వాణిజ్య పనుల శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్‌ జుత్తు తాతారావు, మామిడిపల్లి సర్పంచ్‌ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love