ఏపీలో ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టం

– నిధుల కొరతే ప్రధాన కారణం అంటున్న నిపుణులు
అమరావతి : రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి కీలకమైన ప్రాజెక్టుల భద్రతను రాష్ట్రప్రభుత్వం విస్మరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన నిధులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో కీలకమైన ప్రాజెక్టుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 2019లో ప్రకాశం బ్యారేజితో మొదలు పులిచింతల, అన్నమయ్య, గుండ్లకమ్మ, పోతిరెడ్డిపాడు… ఇలా ఏదో ఒక ప్రాజెక్టు నిర్వహణా లోపంతో దెబ్బతింటోంది. కేవలం నిర్వహణకు సంబంధించిన నిధులు ఇవ్వకపోవడంతో 2020 సెప్టెంబర్‌లో గేటుకు గ్రీస్‌ పూయలేక పులిచింతల ప్రాజెక్టులోని 16వ గేట్‌ హైడ్రాలిక్‌ సిస్టం దెబ్బతిని గేటు కొట్టుకు పోయింది. దీంతో ప్రాజెక్టును స్పిల్‌వే వరకు నీటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనతో ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కేటాయించడంతో పాటు పర్యవేక్షణ పెరుగుతుందని ఆశించిన రైతాంగానికి 2021లో అన్నమయ్య ప్రాజెక్టు ధ్వంసం, ఆ తర్వాత గుండ్లకమ్మ ప్రాజెక్టు దెబ్బతిన్న గేట్ల వ్యవహారంతోపాటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 10వ గేట్‌ దెబ్బతినడం లాంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కింద ప్లంజ్‌పూల్‌ పూర్తిగా దెబ్బతింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల పనులు చేయాలని కేంద్ర ప్రాజెక్టుల భద్రతా కమిటీ ఛైర్మన్‌ పాండ్యా నివేదికలను బుట్టదాఖలు చేశారు. చారిత్రాత్మకమైన ధవళేశ్వరం ప్రాజెక్టు కూడా నిధులు లేక నీరసించి పోతోంది. ధవళేశ్వరం ప్రాజెక్టుకు వున్న 175 గేట్ల మరమ్మతు పనులను 2018లో చేపట్టారు. మరమ్మతుల పనులకు ప్రభుత్వం నిధులను ఇవ్వడం లేదని 53 గేట్లకు మరమ్మతులు చేసి వదిలేశారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌దీ అదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో 80వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో 3.87 టిఎంసిల సామర్థ్యంతో గుండ్లకమ్మ నదిపై చేపట్టిన కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ గేట్ల నిర్వహణ కోసం రూ.3 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం అందుకు తగ్గ నిధులను ఇవ్వకపోవడంతో మూడవ గేట్‌ ధ్వంసమైంది. దీంతో ప్రాజెక్టులోని నీరం తా సముద్రం పాలై ఖరీఫ్‌కు సాగుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. అన్నమయ్య ప్రాజెక్టు కూడా నిర్వహణా లోపంతోనే పూర్తిగా కొట్టుకుపోయింది. ఎగువన కురిసే వర్షాలకు ఎంతనీరు ప్రాజెక్టులోకి వస్తుంది.. దిగువకు ఎంత నీరు వదలాలి అనే నిర్వహణా యంత్రాంగం సరిగాలేక ప్రాజెక్టు కొట్టుకుపోయింది.
రాష్ట్రంలో అన్నమయ్య ప్రాజెక్టు ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇరిగేషన్‌ ఇఎన్‌సి, ఐఐటి, జెఎన్‌టియు లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన నిపుణులతో ప్రాజెక్టుల భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైలెవల్‌ కమిటీ నిర్ణయాలు ఏమ య్యాయని రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించిసాగునీటిని అందించాలని కోరుతున్నారు.

Spread the love