ఏపీలో ఉపాధ్యాయుడి హత్య కేసులో వీడిన మిస్టరీ… నలుగురు నిందితుల అరెస్టు
విజయనగరం: గ్రామంలో ఆధిపత్యం కోసం, ఆర్థికంగా నష్టపరిచాడన్న కారణంతో విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను ప్రత్యర్థులు హత్య చేశారని ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, మరొక నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. హత్య కేసుకు సంబంధించిన వివరాలను విలేకర్ల సమావేశంలో ఆమె ఆదివారం వెల్లడించారు.
ఉద్దవోలు గ్రామంలో ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన మరడాన వెంకటనాయుడు కుటుంబంతో గ్రామంలో ఆధిపత్యం కోసం గొడవలున్నాయి. వెంకట నాయుడు గ్రామంలో ప్రభుత్వ భవనాలకు కాంట్రాక్టు పనులు చేశారు. బిల్లులు మంజూరు కాకుండా కృష్ణ అడ్డుపడుతున్నారనే అనుమానంతో కక్ష పెంచుకున్నారు. ఆయనను చంపేస్తే తమ కక్ష తీరడంతోపాటు, గ్రామంలో ఆధిపత్యం సాధించవచ్చని భావించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి పథకం ప్రకారం కృష్ణను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. శనివారం ఉదయం పాఠశాలకు బైక్‌పై బయలుదేరిన సమాచారాన్ని వెంకట నాయుడుకు, ఆయన సోదరుడు మరడాన మోహనరావుకు అందించారు. మోహనరావు, రెడ్డి రాము కలిసి బొలేరో వాహనంతో కృష్ణను వెంబడించి వెనుక నుంచి ఢకొీట్టారు. వాహనాన్ని ఆపి ఆయన ముఖంపై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. హత్య అనంతరం నిందితులు బొలోరో వాహనాన్ని సంఘటనా స్థలంలోనే విడిచిపెట్టి పరారయ్యారు. ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించిన రాజాం పోలీసులు ప్రధాన పాత్ర పోషించిన మరడాన మోహనరావు, రెడ్డి రాము, మరడాన వెంకటనాయుడు, మరడాన రామస్వామిలను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
హత్య దారుణం : చంద్రబాబు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక ఉపాధ్యాయుడిని చంపడం దారుణమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులపై ప్రభుత్వ పెద్దల, అధికారుల ఉదాసీన వైఖరే ఇలాంటి ఘటనలకు కారణమని పేర్కొన్నారు. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు
ఉపాధ్యాయుడు కృష్ణ మృతదేహానికి తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆదివారం స్వగ్రామం ఉద్దవోలులో అంత్యక్రియలు జరిగాయి. కృష్ణను హత్య చేసిన వారి ఇళ్లపై ఆయన బంధువులు, గ్రామస్తులు దాడులు చేశారు. గడ్డి కుప్పలకు నిప్పు పెట్టారు. ప్రత్యర్థుల కారు, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దాడి విషయం పోలీసులకు తెలియడంతో ఉద్దవోలులో భారీ బందోబస్తు నిర్వహించారు. ఉద్రిక్తత పరిస్థితులను అదుపు చేశారు. ఆందోళనకారుల నుంచి పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కృష్ణ అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ము నాయుడు, మండల నాయకులు హాజరయ్యారు.