– మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్య విద్యార్థులకు ఉపకారవేతనాలు ఎక్కువగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు రాష్ట్రంలో రూ.58 వేలు ఇస్తుంటే, కేరళలో రూ.55 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.55 వేలు, తమిళనాడులో రూ.48 వేలు, కర్ణాటకలో రూ.45 వేలు ఇస్తున్నారని తెలిపారు. వైద్యవిద్యకు ఫీజులు తక్కువగా తీసుకుంటున్న రాష్ట్రం కూడా తెలంగాణాయేనని మంత్రి తెలిపారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు రూ.10 వేలు ఫీజు ఉందని చెప్పారు.
ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో నెంబర్ వన్ స్థానంలో, ఎనిమిది పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే వైద్యులకు పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గతేడాది 3 వేల మంది వైద్యులను నియమించినట్టు చెప్పారు. ఈ నెల 16న గాంధీలో సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ (ఎంసీహెచ్)ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.