ఇ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

– ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లబ్దిదారుల ఇ-కెవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రికి రూ.కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈఎన్టీ ఆస్పత్రిలో చేస్తున్న కాక్లియర్‌ సర్జరీలను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో కూడా అందుబాటులో తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. నిమ్స్‌ స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించి మెడికల్‌ ఆడిట్‌ చేయనున్నట్టు వెల్లడించారు. మరింత మెరుగ్గా డయాలిసిస్‌ సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతిచ్చినట్టు తెలిపారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్‌ రెకగ్నిషన్‌ సాఫ్ట్‌వెర్‌ వినియోగానికి అనుమతిచ్చినట్టు చెప్పారు.
బయోమెట్రిక్‌ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానాన్ని తేవాలని నిర్ణయించినట్టు వివరించారు.

Spread the love