– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌కు తమ పార్టీ గట్టిగా సమాధానం చెప్పిందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఆదివారంనాడిక్కడి బీఆర్‌ఎస్ శాసనసభా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపార్టీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్ రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, శాసన మండలి మాజీ చైర్మెన్ వీ భూపాల్‌రెడ్డి మాట్లాడారు. నోటుకు ఓటు దొంగకు రాహుల్‌గాంధీ పీసీసీ సీటు ఎలా ఇచ్చారో అని ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్‌రావు, శాసనమండలి చైర్మెన్, శాసనసభ స్పీకర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
వారికి ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌పై రైతు వేదికల వద్ద చర్చకు పెట్టే సరికి కాంగ్రెస్‌పార్టీ తోకముడిచిందని అన్నారు. రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరిం చారు. తమ పార్టీ టిక్కెట్లు నిర్ణయించడానికి రేవంత్‌రెడ్డి ఎవరని ప్రశ్నించారు. దమ్ముంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ల మీద పోటీ చేసిన వారికే తిరిగి టిక్కెట్లు ఇచ్చి పోటీలో నిలపాలని సవాలు విసిరారు.
కాంగ్రెస్…పిచ్చోడి చేతిలో రాయి:మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. ఆ పార్టీతో తెలంగాణకు ఒరిగేదేం లేదని అన్నారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షుడు నిజమైన వారసుడని ఎద్దేవా చేశారు. గడచిన పదేండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా… 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ బాగుందో చూసి ప్రజల్ని ఓటు వేయాలని అడుగుదామని అన్నారు.
కరెంట్ మీద ఎంత చర్చ జరిగితే బీఆర్‌ఎస్ పార్టీకి అంత మేలు అని చెప్పారు. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకిగా ఉందనీ, నాడు ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీనే అనీ, 1969లో ఉద్యమం చేస్తే 369 మందిని కాల్చి చంపింది కూడా కాంగ్రెస్ పార్టీనే అనీ, 2004లో గులాబీ జెండాతో పొత్తు పెట్టుకొని తర్వాత ఇవ్వమని ఎగ్గొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు.
కేసీఆర్‌కు పోటీ ఉండదనీ, ఆయన ఎక్కడ పోటీ చేసినా కళ్లకద్దుకొని గెలిపిస్తారని చెప్పారు.