డీఎంఈ కార్యాలయం ముందు డాక్టర్ల ఆందోళన

– కౌన్సెలింగ్‌ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్‌
– 900 పోస్టులకు 180 ఖాళీలే చూపించడంపై ఆగ్రహం
– నిలిచిన ప్రమోషన్ల ప్రక్రియ
– ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న డీఎంఈ
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
హైదరాబాద్‌ కోఠిలోని డీఎంఈ ఆఫీస్‌ ముందు వైద్యులు ఆందోళనకు దిగారు. కొత్తగా ప్రకటించిన వైద్య కళాశాలలు సహా మొత్తం 900 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 180 ఖాళీలే చూపించి పోస్టింగ్‌ ఇచ్చిన చోటికి వెళ్లాలనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్‌ ప్రక్రియను హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయంలో మంగళవారం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ఖాళీలను చూపించిన తర్వాతే కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని వైద్యులు పట్టుబట్టారు. జీఓ 273 ప్రకారం ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ మేరకు పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైద్యులు నిరసనకు దిగారు. దాంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ రసాభాసగా మారి నిలిచిపోయింది. అయితే, తాము కౌన్సెలింగ్‌ కోసమే వచ్చామని, కానీ ఖాళీల సంఖ్య.. ప్రాంతాలను చూపించకుండా అధికారులు తమకు నచ్చిన చోట పోస్టింగ్‌ వేసి వెళ్లండి లేకుంటే మానేయండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వైద్యులు ఆరోపించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిర్వహించి పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని డీఎంఈ ఆడిటోరియంలో బైటాయించారు కౌన్సెలింగ్‌ ప్రక్రియపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
దాంతో ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించి అన్ని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలను చూపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని డీఎంఈ హామీ ఇచ్చినట్టు డాక్టర్‌ అన్వర్‌, డాక్టర్‌ జలగం తిరుపతిరావు, డాక్టర్‌ కిరణ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో డాక్టర్‌ బొంగు రమేష్‌, డాక్టర్‌ లాలూ ప్రసాద్‌ రాథోడ్‌, డాక్టర్‌ తిరుపతిరావు, డాక్టర్‌ నరహరి, డాక్టర్‌ శేఖర్‌, డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ సిద్దిపేట రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love