పెండింగ్‌లో రోడ్ల అప్‌గ్రేడేషన్‌ 14 ఎన్‌హెచ్‌

– ప్రతిపాదనలకు మోక్షమేది !?
– తొక్కిపెట్టిన కేంద్రం
– రాష్ట్రాభివృద్ధికి విఘాతం
– పలుసార్లు లేఖలు రాసినా గడ్కరీ శాఖ మౌనం
– అసహనంలో కేసీఆర్‌ సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో మౌలికసదుపాయాల కల్పనను మెరుగుపరిచేందుకు చేపట్టిన రోడ్లఅప్‌గ్రేడేషన్‌ కార్యక్ర మాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. పలు ప్రతిపాదనలను పంపినా పెండింగ్‌లోనే పెట్టింది. గత ఏడాది క్రితం రాష్ట్రానికి చెందిన 14 రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలంటూ 2022, జులై ఏడున పంపిన ప్రతిపాదన లను మోడీ సర్కారు పక్కనబెట్టింది. అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి అవసరమైన అన్ని నివేదికలు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. దీంతో రోడ్ల అనుసంధానం ద్వారా రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఆమడదూరంలోనే ఉంటున్నది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖలో గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం.
ఉద్దేశం
రాష్ట్రంలోని దాదాపు 15 నుంచి 20 జిల్లాలకు అవసరమైన కనెక్టివిటీని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక వాడలు, టూ రిజం, అంతరాష్ట్ర అనుసంధానం, దేవాలయాలకు రోడ్లను కనెక్ట్‌ చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందడంతో పాటు అభివృద్ధికి మరింత అవకాశం కలుగుతుంది. తద్వారా అన్ని రకాలుగా ఉపయోగం జరగనుంది.
14 రోడ్లు..1656 కిమీ
రాష్ట్రంలోని దాదాపు 20 జిల్లాల్లో 14 రోడ్లను జాతీయ రహదారులు(ఎన్‌హెచ్‌)గా అప్‌గ్రేడ్‌ చేయాలని కేసీఆర్‌ సర్కారు కేంద్రాన్ని కోరింది. ఇందుకుగాను అలైన్‌మెంట్‌తో పాటు ఫిజిబులిటీ నివేదికలు సైతం కేంద్రానికి పంపారు. ఈమేరకు రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి, కేంద్ర ఉపరితల రవాణా శాఖకు మూడు, నాలుగుసార్లు లేఖలు రాశారు. అయినా పట్టించుకోలేదు. పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక లను అధ్యయనం చేసి, రోడ్లను అప్‌గ్రేడ్‌ చేయాలా ? వద్దా ? అనే సంగతి తేల్చడానికి కేంద్రానికి మనసొప్పడం లేదు. వీటి మంజూరుకుగాను అసెంబ్లీతోపాటు ఇతర చోట్లా చర్చ జరిగింది. అయినా కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేదు. కేంద్ర మంత్రి నితీన్‌ గడ్కరీ చూసి చూడనట్టుగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సైతం అలక్ష్యంగా ఉన్నట్టు సమా చారం. ఎంతసేపూ రాజకీయా రొచ్చు మినహా ప్రజలకు మేలు చేసే ఉద్దేశ్యం లేకపోవడం పట్ల ఆందోళన, ఆదేవన వ్యక్తమవుతున్నది. దీంతో కేసీఆర్‌ సర్కారు అసహానం వ్యక్తం చేస్తున్నది. రొచ్చు విమర్శలు మినహా ఆచరణాత్మక పునులు చేయడం లేదనే విమర్శలు వస్తుండటం తెలిసిందే.
రోడ్డు పేరు దూరం(కి.మీలలో)
చౌటుప్పల్‌ -ఆమనగల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి 182
కరీంనగర్‌-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం 165
వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం 110
ఎర్రవల్లి ఎక్స్‌ రోడ్‌-గద్వాల-రారుచూర్‌ 67
మన్నేగూడ-వికారాబాద్‌-తాండూరు- జహీరాబాద్‌-బీదర్‌ 133.9
మరికల్‌-నారాయణపేట-రామసముద్రం 63
జగిత్యాల్‌-పెద్దపల్లి-కల్వశ్రీరాంపూర్‌-కిస్మత్‌పేట్‌
-కల్వపల్లి-మోరంచపల్లి-రామప్పటెంపుల్‌-జంగలపల్లి 164
సారపాక-ఏటూరీనాగారం 93
పుల్లూరు-ఆలంపూర్‌-జెట్‌ప్రోల్‌-పెంటవెళ్లి-కొల్లాపూర్‌
లింగాల్‌..అచ్చంపేట్‌-డిండి-దేవరకొండ- మల్లేపల్లి-నల్లగొండ 225.1
దుద్దెడ-కొమ్రంవెళ్లి-యాదగిరిగుట్ట-
రాయిగిరి క్రాస్‌రోడ్‌ 63
జగ్గయ్యపేట-వైరా-కొత్తగూడెం 100
సిరిసిల్ల-వేములవాడ-కోరుట్ల-ఎక్స్‌టెన్షన్‌ 65
భూత్‌పూర్‌-నాగర్‌కర్నూల్‌
-మన్ననూర్‌-మడ్డిమడుగు-గంగాలకుంట-
సిరిగిరిపాడు 165.5
కరీంనగర్‌-రాయపట్నం 60

Spread the love