బాలికల పట్ల ప్రిన్సిపాల్‌ అసభ్య ప్రవర్తన

– రాకేష్‌ విద్యానికేతన్‌లో ఘటన
– పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
– పోలీసుల అదుపులో ప్రిన్సిపాల్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
అత్తాపూర్‌ ఎస్‌ఆర్‌డీజీ స్కూల్‌ విద్యార్థినిపై పీఈటీ వేధింపుల ఘటన మరువకముందే రాకేష్‌ విద్యానికేతన్‌ హైస్కూల్లోనూ అలాంటి ఘటనే జరిగింది. పదో తరగతి విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్‌ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగుజూసింది. పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్‌నగర్‌లోని రాకేష్‌ విద్యానికేతన్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్‌ గుర్రం శంకర్‌ కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాఠశాల సమయం అయిపోయిన తర్వాత స్పెషల్‌ క్లాస్‌ల పేరుతో రాత్రి 8, 9 గంటల వరకు స్కూల్లోనే ఉంచేవాడు. ఆ సమయంలో బాలికలను అసభ్యంగా తాకుతూ ముద్దులు పెట్టాలని వేధించేవాడు. అదేవిధంగా బాలికల ఫోన్‌ నెంబర్లు తీసుకొని తరచూ ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ఇటీవల ప్రిన్సిపాల్‌ వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఇద్దరు విద్యార్థినులు శనివారం రాత్రి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆదివారం ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. తను అలా చేయలేదని ప్రిన్సిపాల్‌ బుకాయించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్‌ గుర్రం శంకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Spread the love