ఆశాలకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు నిర్ణయించాలి

– ఆశావర్కర్ల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో : వంగూరు రాములు
వతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌ గోల్కొండ చౌరస్తా వద్ద సీఐటీయూ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యాలయంలో ఆశా వర్కర్ల రాష్ట్ర విస్తృత సమావేశం ఆశా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వంగూరు రాములు మాట్లాడుతూ ఆశ వర్కర్లు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు అనేక రేట్లు పెరిగాయనీ, మరోవైపు గతంతో పోలిస్తే పని భారం కూడా బాగా పెరిగిందని చెప్పారు. ఆశ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నీలాదేవి మాట్లాడుతూ ఆశాలకు గతంలో ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రిజిస్టర్‌ ఇవ్వలేదని, యూనిఫామ్‌ నాణ్యతగా లేదనీ, అనేక ప్రాంతాల్లో రెస్ట్‌ రూమ్‌లు కూడా ఏర్పాటు చేయలేదనీ, జాబ్‌చార్ట్‌ కూడా ఇంకా ఇవ్వలేదని తెలిపారు. అనేక రకాల పనులు ఆశ వర్కర్లు చేయాల్సి వస్తుందని పని భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఆశా యూనియన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు శ్రీలత, కొండాలక్ష్మి, రాజమణి, సాధన,హేమలత,సునీత తదితరులు పాల్గొన్నారు.

Spread the love