బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లోని షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సెక్రటేరియట్‌లో న్యూఢిల్లీ హాల్‌ను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. న్యూఢిల్లీ హల్‌ను మినీ ఇండియా గాను, దేశ సంస్కృతిపై మంచి అవగాహనను పెంపొందిస్తుందని జైశంకర్ తెలిపారు. వచ్చే నెలలో ఎస్‌సీఓ సమ్మిట్ మొదటిసారిగా భారత్ అధ్యక్షతన జరగనుంది. ఎనిమిది దేశాలు సభ్యులుగా ఉన్న ఎస్‌సీఓ గ్రూప్ సెక్రటేరియట్ బీజింగ్‌లో ఉంది. చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గి, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాకిస్థాన్ సభ్య దేశాలు. ఇప్పటి వరకూ ఆరు వ్యవస్థాపక దేశాలు చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గి, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌కు మాత్రమే ఎస్‌సీఓ సెక్రెటేరియట్‌లో ప్రత్యేక హాళ్లు ఉన్నాయి. భారత్ తాజాగా తన ప్రత్యేక హాల్‌ను ప్రారంభించింది. భారత దేశ సంప్రదాయం, నిర్మాణ నైపుణ్యం ప్రతిబింబించే విధంగా ఈ హాల్‌ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. సమావేశాలతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లు, సినిమా స్క్రీనింగ్‌లు, యోగా క్లాసులు, డ్యాన్స్‌లు, మ్యూజిక్ క్లాసులు వంటి వివిధ ప్రయోజనాలకు అనుగుణంగా మల్టీ ఫంక్షనల్ స్పేస్‌గా హాల్‌ను ఏర్పాటు చేశారు.