కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య!

నవతెలంగాణ- కోటా:  దేశంలో పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన కోటా (రాజస్థాన్) నగరంలో.. పరీక్షల ఒత్తిడి మరో విద్యార్థిని బలితీసుకుంది. సారీ నాన్నా.. అంటూ ఆ విద్యార్థి సూసైడ్ లేఖ రాసి మంగళవారం ఉరివేసుకుని మరణించాడు. మృతుడిని పోలీసులు భరత్‌ కుమార్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. ఇది గత 48 గంటల్లో వెలుగు చూసిన రెండో ఆత్మహత్య కేసు కావడంతో స్థానికంగా కలకలం రేగుతోంది. భరత్‌ కుమార్ రాజ్‌పుత్ కొంతకాలంగా నీట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే అతడు రెండు సార్లు నీట్‌కు హాజరయ్యాడు. తన బంధువు రోహిత్‌తో కలిసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. కాగా, మే 5న మరోసారి అతడు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం 10.30 సమయంలో రోహిత్ ఏదో పనిమీద బయటకు వెళ్లగా భరత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో గంట తరువాత తిరిగొచ్చిన రోహిత్‌కు తన గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించాడు. కిటిలోకి తొంగి చూడగా భరత్ ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు మునుపు భరత్ ఓ సూసైడ్ నోట్ కూడా రాసినట్టు తెలిపారు. ‘‘సారీ నాన్నా, ఈ ఏడాదీ నేను సక్సెస్ కాలేకపోయాను’’ అని భరత్ లేఖలో పేర్కొన్నాడు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో భరత్ తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love