దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది

– మాజీ ఎమ్మెల్యే జలగం
నవతెలంగాణ-దమ్మపేట
దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని ప్రతిపక్షం అనేదే లేదని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు స్పష్టం చేశారు. ఆదివారం దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామంలో ఒక పామాయిల్‌ తోటలో జలగం వెంకట్రావు తన ఆత్మీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. తాను చేసిన అభివృద్ధిని డప్పుకొట్టుకుంటూ తిరిగే వ్యక్తిని కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల ఆలోచన చాలా వ్యత్యాసంగా ఉందని తన 20 ఏళ్ళ రాజకీయ అనుభవంతో ప్రజల్లో తిరుగుతూ చెబుతున్నానని అన్నారు. తన రాజకీయ పంథా ప్రారంభం నాటి నుండి నేటి వరకు ఎటువంటి మార్పూ లేదని పేర్కొన్నారు. పీపుల్స్‌ మేండెట్‌ ప్రకారం తాను ప్రణాళికతో ముందుకు కొనసాగుతానని అన్నారు. తాను 2014 నుండి 2018 వరకు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలలను అందజేశానని పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోతే చాలా వెనుకపడుతుందని గత 5 సంవత్సరాలుగా కొత్తగూడెం ప్రాంతం నుండి ప్రజలు ఉపాధి కోసం వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 2004 లో సత్తుపల్లి శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు అశ్వారావుపేట, దమ్మపేట మండలాలలో ఐటిడిఎ ఆధ్వర్యంలో జామాయిల్‌ మొక్కలు నాటుతూ ఉంటే రైతులకు అవగాహన కల్పించి ఐటిడిఎ అధికారులతో మాట్లాడి పామాయిల్‌ తోటలు పెంచే విధంగా తాను కృషి చేశానని తెలిపారు. అశ్వారావుపేటలో ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్‌ కాలేజీలో తాను ప్రభుత్వంతో మాట్లాడి హార్టీకల్చర్‌ విభాగాన్ని సైతం ఏర్పాటు చేశానని, తాను లేని సమయంలో హార్టీ కల్చర్‌ విభాగాన్ని ఆంధ్రాలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తాను ఏర్పాటు చేసే ఆత్మీయ సమ్మేళనాలు రాజకీయ ప్రయోజనంతో కూడుకున్నవి కావని మన ప్రాంతం అభివృద్ధి చెందిందా, లేదా అనే ఆలోచనతో ప్రజా ప్రయోజనం కోసం తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. రాజకీయంగా ఎంతోమంది పార్టీల నుండి టిక్కెట్లు ఆశించడంలో తప్పేమీ లేదని వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదని తన రాజకీయ జీవితంలో తాను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడంలేదని తెలిపారు. రాజకీయాలు మాట్లాడటానికి ఇంకా సమయం ఉందని నోటిఫికేషన్‌ వచ్చిన అనంతరం తాను మాట్లాడతానని ఆ సమయంలోనే అన్ని విషయాలు సూటిగా వివరిస్తానని తెలపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి జలగం అభిమానులను స్వయంగా వెంకట్రావు స్వాగతం పలికి భోజన వసతులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, దమ్మపేట , మండలాలతో పాటు కొత్తగూడెం నియోజకవర్గం నుండి సుమారు 200 కార్ల కాన్వాయితో పట్వారిగూడెం చేరుకున్నారు.

Spread the love