బీజేపీని ఒంటరి చేద్దాం

– 400 కాదు 200 సీట్లూ కష్టమే
– మోడీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం
– తెలంగాణలో నేటి నుంచి 11 వరకు ప్రజల్లోకి
– జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపెయిన్‌లు
– కనీసమద్దతు ధరల చట్టం, రుణమాఫీ చేయకపోవడంపై రైతులకు వివరిస్తాం
– సంయుక్త కిసాన్‌మోర్చా జాతీయ నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లు కాదు..200 సీట్లు కూడా దాటబోవని సంయుక్త కిసాన్‌మోర్చా (ఎస్‌కేఎం) జాతీయ నాయకులు నొక్కి చెప్పారు. రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో గ్రామాల్లోకి బీజేపీ అభ్యర్థులను ప్రచారానికి రానివ్వని పరిస్థితి నెలకొందన్నారు. మోడీ, అమిత్‌, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారమంతా డంబాచారమేనని స్పష్టం చేశారు. ఢిల్లీ చారిత్రాత్మక పోరాటం సందర్భంగా రైతాంగానికి రాతపూర్వకంగా మోడీ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్‌.ఎస్‌.స్వామినాథ్‌ చేసిన సిఫారసులను బుట్టదాఖలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఒంటరి చేద్దాం.. వ్యతిరేకిద్దాం.. శిక్షిద్దాం.. దేశాన్ని రక్షించుకుందాం నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామనీ, అందులో భాగంగానే మంగళవారం నుంచి 11వ తేదీ వరకు ప్రజల్లోకి వెళ్తామనీ, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రచారం చేస్తామని వారు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎస్‌కేఎం జాతీయ నాయకులు డాక్టర్‌ విజ్ఞూకృష్ణన్‌, డాక్టర్‌ సునీలం, సురేష్‌ రౌత్‌, అవతార్‌ సింగ్‌ మెహ్మ, కె బాలకృష్ణన్‌, రవి కిరణ్‌ పుంచ, అరుణ్‌ కుమార్‌, రాయల చంద్రశేఖర్‌, ఎ.నాగేంద్ర మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. పదేండ్ల కాలంలో 4.25 లక్షల మంది రైతులు, వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు.
ఆత్మహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకున్నదని విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 13 నెలల పాటు సుదీర్ఘ పోరాటం జరిగిందనీ, అందులో 750 మంది రైతులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. రైతుల పోరాట ఫలితంగా 2021 డిసెంబర్‌ 9న మోడీ సర్కారు దిగొచ్చి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు కనీస మద్దతు ధరల చట్టం, రుణమాఫీ చేస్తామని హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులతో మాట్లాడకుండా విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్లో పెట్టబోమనీ, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని రాతపూర్వకంగా హామీనిచ్చిందని తెలిపారు. రెండేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకపోగా అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టే చర్యలకు పూనుకున్నదని విమర్శించారు. పంట కొనుగోలు పథకానికి నిధుల్లో కోతపెట్టిందనీ, ఎఫ్‌సీఐని నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. రుణమాఫీ ప్రస్తావనే లేదన్నారు. ఇదే సమయంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న హామీ ఏమైందని మోడీని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన బీజేపీకి చెందిన అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్కేఎం రాష్ట్ర నాయకులు ఎస్‌.అన్వేశ్‌రెడ్డి, టి.సాగర్‌, విస్సాకిరణ్‌, వి.ప్రభాకర్‌, కోటేశ్వరరావు, మామిడాల భిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఆర్‌.వెంకట్రాములు ప్రసాదన్న, అరిబండి ప్రసాద్‌ మాట్లాడుతూ..
రైతాంగంపై మోడీ సర్కారు మోపిన అక్రమ కేసులను ఎత్తివేయకపోగా రైతుల పోరాటానికి అండగా నిలబడిన మేధావులు, విలేకర్లపై అక్రమ కేసులు బనాయించిన తీరును వివరించారు. సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ వ్యవస్థను తీసుకొచ్చిందని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.700 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండగా.. మోడీ సర్కారు మాత్రం ఏటేటా నిధులు తగ్గిస్తూ పోతున్న తీరును ఎండగట్టారు.

Spread the love