గ్రామీణమే కీలకం

– ఛత్తీస్‌గఢ్‌లో వారి ఓట్లు అధికం
– రాష్ట్రంలో 76 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే
– నేడు ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
– కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ
– బరిలో పలువురు కీలక నేతలు
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని మిగిలిన ఏడు లోక్‌సభ స్థానాలకు మూడో దశలో భాగంగా మే 7న పోలింగ్‌ జరగనున్నది. రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌లో బస్తర్‌లో జరిగిన తొలి దశలో 68.3 శాతం, రెండో దశలో 3 నియోజకవర్గాలైన రాజ్‌నంద్‌గావ్‌, కంకేర్‌, మహాసముంద్‌లలో 76.24 శాతం పోలింగ్‌ నమోదైంది. అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల స్టార్‌ క్యాంపెయినర్లు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించేందుకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చారు. కారణం.. రాష్ట్ర మొత్తం జనాభాలో 76 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండటమే. దీంతో అభ్యర్థుల భవితవ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్ల పైనే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొని ఉన్నదని అంటున్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఏడు లోక్‌సభ స్థానాల్లో కోర్బా మినహా మిగిలిన ఆరు స్థానాలను 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నది. గత ఏడాది డిసెంబర్‌ 10న బీజేపీ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్‌ సాయిని ఎన్నుకున్నప్పుడు.. అతని నియామకం బీజేపీకి దేశవ్యాప్తంగా గిరిజనుల్లో ఆదరణ లభిస్తుందని ఆ పార్టీ అధినాయకత్వం భావించింది. దీంతో ఆయనను సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం రెండో దఫా పాలనలో ఇది కనిపిస్తుంది. గిరిజన సంఘాలు సాంప్రదాయకంగా బీజేపీకి దూరంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటు బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా గిరిజన వర్గాల్లో క్యాడర్‌ను నిర్మించాలని నిరంతరం చూస్తున్నది. హిందూ జాగరణ్‌ మంచ్‌ వంటి సంఫ్‌ు అనుబంధ సంస్థలు ఇందుకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయి. గిరిజనుల అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరగా చేసుకొని వారిలోనూ మతం అనే విషబీజాలు నాటే ప్రయత్నాలను చేస్తున్నాయి.
కాగా, గిరిజనులను ఐక్యం చేయటంలో కాంగ్రెస్‌ కాస్త సవాళ్లను ఎదుర్కొంటున్నదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గత ఐదేండ్లలో తమ పాలనలో భూపేశ్‌ బఘేల్‌ ప్రభుత్వం చేపట్టిన ‘దేవగుడి’ (గిరిజన గ్రామ దేవాలయాలు), ‘ఘోతుల’ (ఆదివాసీల సామాజిక-సాంస్కృతిక కేంద్రాలు) అభివృద్ధి గురించి ప్రచారం చేసుకుంటున్నది. అలాగే, కాంగ్రెస్‌ తన ‘న్యారు’ మ్యానిఫెస్టో ప్రజల హృదయాలను గెలుచుకుంటుందని నమ్ముతున్నది.
మంగళవారం పోలింగ్‌ జరగనున్న ఏడు స్థానాల్లో రెండు ఎస్టీ నియోజకవర్గాలు కాగా, ఒకటి ఎస్సీ వర్గానికి చెందినవి ఉన్నాయి. మూడో విడతలో 26 మంది మహిళలు సహా 168 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 37 మంది కోటీశ్వరులు కాగా,16 మందిపై క్రిమినల్‌ కేసులు నమోద య్యాయి. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.బీజేపీ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ విజరు బాఘెల్‌, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సరోజ్‌ పాండే (కోర్బా), కాంగ్రెస్‌ ఎంపీ జ్యోత్సానా మహంత్‌ (కోర్బా), బీజేపీకి చెందిన చింతామణి మహరాజ్‌ (సర్గుజా స్థానం నుంచి) పోటీ పడుతున్న ప్రముఖ నాయకులు. కాంగ్రెస్‌ మాజీ రాష్ట్ర మంత్రి శివ దేహరియా (జంజ్‌గిర్‌-చంపా), కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్‌ (బిలాస్‌పూర్‌) నుంచి బరిలో ఉన్నారు.

Spread the love