రైతులకు గుడ్‌న్యూస్‌

– రైతు భరోసా నిధులు రూ.2 వేల కోట్లు విడుదల
– రెండ్రోజుల్లో పంపిణీ పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఐదెకరాల పైబడి భూమి ఉన్న రైతులకు ఆయా నిధులను గురువారంలోపు అందిస్తామని ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ. 2వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసినట్టు సమాచారం. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం గతంలోనే రైతు భరోసా అందించింది. తాజాగా ఐదెకరాల పైబడిన వారికి కూడా రైతుభరోసా నిధుల చెల్లింపులను ప్రారంభించనున్నారు. మూడు రోజుల్లో లబ్దిదారులందరి బ్యాంక్‌ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
రూ.15 కోట్ల పంట నష్ట పరిహారమూ విడుదల
రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకూ ప్రభుత్వం నష్టపరిహారం అందజేయనుంది. వర్షాలు, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతివ్వడంతో నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టానికి గాను 15,246 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. 15.81 కోట్ల నిధులు విడుదల చేసింది. అత్యధికంగా కామారెడ్డిలో 10,328.04 ఎకరాలు, అత్యల్పంగా సంగారెడ్డిలో 76.04 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ గుర్తించిన లబ్దిదారులకు త్వరలో బ్యాంకుల ద్వారా పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Spread the love