అచ్ఛేదిన్‌ కాదు.. చచ్చేదిన్‌

– బీజేపీ ఎంపీలు గెలిస్తే మన హక్కుల కోసం పోరాడరు
– కాంగ్రెస్‌ ప్రభుత్వంతో నాశనం
– కాంగ్రెస్‌ బోనస్‌.. ఓ బోగస్‌
– నిలదీశాను కాబట్టే నా బిడ్డ అరెస్టు
– కేంద్రంలో ప్రాంతీయ శక్తుల ప్రభుత్వమే..!
– నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి : రోడ్‌షోలో మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- నిజామాబాద్‌సిటీ
నరేంద్ర మోడీ పాలనలో అచ్ఛేదిన్‌ కాదు.. చచ్చేదిన్‌ వచ్చిందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్‌లో గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ గెలిచారని, ఆయన వల్ల ఏమన్నా లాభం జరిగిందా..? అని ప్రశ్నించారు. ‘నేను సీఎం అయినప్పుడు మోడీ కూడా ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అయ్యే ముందు.. ప్రధాని అయిన తర్వాత వంద..యాభై నినాదాలు చెప్పారు. ఒక్కటన్న నిజమైందా..? సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ అయిందా..? కాలేదు కదా దేశ్‌ కా సత్య నాశ్‌ అయింది. మేకిన్‌ ఇండియాలో, డిజిటల్‌ ఇండియాలో ఏమైనా వచ్చిందా..? బేటీ బచావో బేటీ పడావో అన్నారు. కానీ దేశంలో మహిళలపై లైంగికదాడులు పెరిగాయి.. బాలికలకు రక్షణ లేకుండా పోయింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు’ అని అన్నారు.
చనిపోయే వరకు నా గుండెల్లోనే నిజామాబాద్‌..
మోడీ గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తా అంటున్నాడు.. యుద్ధం చేద్దామా? వద్దా? అని కేసీఆర్‌ అడిగారు. ”మన గోదావరి మనకే ఉండాలి.. ఆ నది మీద నీళ్ల హక్కు మనకు ఉండాలి.. ఆ హక్కు కావాలంటే నిజామాబాద్‌ పులి బిడ్డ బాజిరెడ్డి గెలవాలి” అని పిలుపునిచ్చారు. ఈ గ్యాస్‌ గాళ్లు గెలిస్తే.. ఉన్న గోదావరి ఊసిపోతదన్నారు. కేసీఆర్‌ చనిపోయే వరకు తన గుండెల్లో నిజామాబాద్‌ ఉంటుందన్నారు. ‘బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ దగ్గర చేతుల కట్టుకుంటారు. మన హక్కుల కోసం నోరు మెదపరు” అని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరద కాల్వను నాశనం చేశారని, కరెంట్‌ కోతలు ఉన్నాయని అన్నారు. తాము ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇచ్చామని, అది కూడా బంద్‌ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలల్లోనే ఎందుకు మారిపోయింది.. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్థత కాదా..? అని ప్రశ్నించారు. తాను కూడా హిందువునేనని, కానీ రాష్ట్రంలో ఉన్న యావత్‌ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్‌ అని అన్నారు. యువకులు ఆవేశంలో ఓటు వేయకుండా ప్రజాస్వామ్య పరిణితితో, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్‌ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో అని కూలంకషంగా చర్చించి, ఓటు వేయాలని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అన్ని విషయాల్లో మోడీని వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను భయపడను. కాంప్రమైజ్‌ కాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం చేస్తానే తప్ప కేసీఆర్‌ ఏనాడూ లొంగిపోలేదు. ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తే లేదు. ఆరు నూరైనా సరే లొంగిపోను” అని స్పష్టం చేశారు.
బోనస్‌.. ఓ బోగస్‌..
ఆరు గ్యారంటీ హామీలతో కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌.. వట్టి బోగస్‌ అని విమర్శించారు. ‘సరైన సమయంలో రైతులకు రైతుబంధు వేయలేదు. కేసీఆర్‌ రోడ్డెక్కడంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు వేయడం ప్రారంభించింది’ అని తెలిపారు.
14 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ కీలకం
మోడీకి మోజార్టీ వస్తలేదు.. ఎన్డీఏ కూటమికి 250 కి మించి సీట్లు రావు.. మనం 14 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ కీలకంగా మారుతుందని కేసీఆర్‌ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ రాదని, ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంటే వస్తదని, అప్పుడు బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర అయితదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌ గుప్త, జెడ్పీ చైర్మెన్‌ విఠల్‌రావు, మేయర్‌ దండు నీతూ కిరణ్‌, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love