అంతా ఏకపక్షమే

– స్థానిక నాయకత్వంతో సంప్రదింపుల్లేవ్‌
– పొత్తుల్లో బీజేపీవి పై నుండి రుద్దే నిర్ణయాలే
– జేడీ(యూ) నుంచి జేడీ(ఎస్‌) వరకు ఇదే తీరు
పలు రాష్ట్రాల్లో కాషాయపార్టీ నేతల్లో అసంతృప్తి : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేంద్రీకృత అధ్యక్ష రూపంలో ఉంటే..డబ్బు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికార బలం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎన్నికల్లో పోటీ చేసే వారి స్థాయి తగ్గుతుంది. జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ దాదాపు అన్ని ప్రధాన నిర్ణయాలను నేరుగా అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు తీసుకుంటారు. ఇందుకు బీజేపీనే ఒక చక్కటి ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్రీకృత నిర్ణయాల కారణంగానే అగ్రనాయకత్వం కర్నాటకలో జేడీ(ఎస్‌)తో, బీహార్‌లో జేడీ(యూ)తో పొత్తు పెట్టుకున్నది. ముఖ్యంగా, కర్నాటకలో దీని ప్రభావం కనిపిస్తున్నది. జేడీ(ఎస్‌)తో పొత్తుపట్ల రాష్ట్రంలో ఒక నేత వారించినప్పటికీ.. బీజేపీ అధిష్టానం అదేమీ పట్టించుకోకుండా జేడీ(ఎస్‌)తో పొత్తుకు ముందుకెళ్లిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
కర్నాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్‌) బహిష్కృత నాయకుడు, హసన్‌ ఎంపీ లైంగిక దౌర్జన్యం కేసు రాష్ట్ర రాజకీయాలనే గాక దేశాన్ని షాక్‌కు గురి చేసింది. దాని ప్రభావం జేడీ(ఎస్‌)తో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పైనా పడుతుందనీ, రాబోయే ఎన్నికల్లో ఇది ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక బీహార్‌లో జేడీ(యూ)తో పొత్తు రాష్ట్ర నేతలనే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. భవిష్యత్తులో నితీశ్‌తో పొత్తు ఉండదని ఒకానొక సందర్భంలో సాక్షాత్తూ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షానే వెల్లడించాడు. ఒకపక్క, నితీశ్‌ ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించాడు. ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉన్న నితీశ్‌, బీజేపీ సంబంధాలు అనూహ్యంగా స్నేహబంధానికి దారి తీశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అధికారం కోసం కూటములు మారుతూ.. రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని కనబర్చని నితీశ్‌కు అవకాశవాది అనే పేరు ఉన్నది. అంతేకాదు, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడింది. ఇవన్నీ బీహార్‌ రాష్ట్ర నేతలకు తెలుసు. కానీ బీజేపీ అధిష్టానం వారి మాటలను వినకుండా జేడీ(యూ)తో పొత్తును ఏర్పర్చుకున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి ఈ విధంగానే పొత్తులు పెట్టుకున్నదని చెప్తున్నారు. అలాగే, కళంకిత నేతలనూ పార్టీలో చేర్చుకొని స్థానిక నాయకత్వానికి బీజేపీ ఎలాంటి గౌరవమూ ఇవ్వలేదని వివరిస్తున్నారు. ఏపీలోనూ టీడీపీతో పొత్తు కూడా అక్కడి స్థానిక నాయకత్వానికి ఇష్టం లేకున్నా.. కేంద్ర స్థాయిలో స్నేహం కుదిరిందని బీజేపీ నాయకులే కొందరు చెప్తున్నారు. యూపీలో యోగితో సంబంధం లేకుండా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుంటున్నదని చెప్తున్నారు. ఈ తీరు యోగి, మోడీ-షా ద్వయం మధ్య ఎడబాటును తీసుకొచ్చిందని అంటున్నారు.
నాయకత్వం చేసిన ఘోర తప్పిదాలను ఒప్పుకునే వారు పార్టీలో కొందరైతే, విజయంపై అతి విశ్వాసంతో మరికొందరు దానిని విస్మరిస్తున్నారు. ఈ నిర్ణయాల ప్రక్రియను ఎక్కువగా కేంద్రీకరించడం వల్ల కిందిస్థాయి వర్గాల్లో క్రమక్రమంగా ఒక ప్రతికూల భావన ఏర్పడుతున్నదని కాషాయపార్టీ అధినాయకత్వం గ్రహించడం లేదనీ, ఫలితంగా కింది స్థాయి నాయకత్వం రాజకీయంగా తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్తున్నారు. గత పదేండ్లలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(ఎన్డీయే) అభ్యర్థుల్లో అత్యధికులకు ఇదే పరిస్థితని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు.
2014 నుంచి మోడీ కరిష్మాతో గెలుస్తున్నామనీ, ఈ సారి కూడా అదే అంశం పని చేస్తుందన్న అతి విశ్వాసం బీజేపీ నేతల్లో అధికంగా కనిపిస్తున్నది. అందుకే బీజేపీకి 370కి పైగా, ఎన్డీయేకు 400కి పైగా సీట్లే లక్ష్యంగా ‘చార్‌ సౌ పార్‌’ నినాదాన్ని ప్రధాని మోడీ పలు సందర్భాల్లో వినిపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారాయనీ, బీజేపీ మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాల్లోని నాయకత్వానికి విలువనివ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కూటములతో ముందుకెళ్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయని అంటున్నారు.

Spread the love