పోరాడే శక్తులకు బలమివ్వండి

– బీజేపీ మళ్లీ గెలిస్తే సనాతన ధర్మం అమల్లోకొస్తుంది
– సమాన హక్కులు పోతాయి
– కష్టజీవుల అభ్యర్థి జహంగీర్‌ను పార్లమెంట్‌కు పంపాలి : రామన్నపేట రోడ్‌షోలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-రామన్నపేట
”పొరపాటున బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దుచేసి, సనాతన ధర్మాన్ని అమలు చేస్తుంది. సనాతన ధర్మం అంటే మనుధర్మం.. మనుధర్మం అంటే అగ్రవర్ణ కుల ధర్మం.. దళిత బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు పోతాయి” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్‌షో నిర్వహించారు. పార్టీ శ్రేణులు భారీగా తరలిరాగా.. పట్టణమంతా ఎరుపుమయంగా మారింది. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగిస్తూ.. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, 140 కోట్ల జనాభా భవిష్యత్‌కు సంబంధించిన కీలకమైన ఎన్నికలని అన్నారు. బీజేపీ పదేండ్ల కాలంలో ప్రజల మధ్య వైషమ్యాలను పెంచిపోషించిందని, అందుకే ఆ పార్టీని ఓడించడానికి దేశంలోని 28 పార్టీలు ఒక్కటై పోరాడుతున్నాయని చెప్పారు. ఇటీవల మోడీ ”ఇప్పటివరకు మేము చూపించింది ట్రైలర్‌ అని.. ఈసారి గెలిస్తే అసలు సినిమా చూపిస్తామంటున్న” దాంట్లో ఏముందో అర్థం చేసుకోవాలన్నారు. రామరాజ్యం తెస్తామంటే తప్పే ముందని పొరపాటున కూడా అనుకోవద్దని, హిందూ రాజ్యం అంటే అగ్రకులాల ఆధిపత్య రాజ్యమని, దేశ సంపదను దోచుకుపోయే రాబందుల రాజ్యం తప్ప మరొకటి కాదని తెలిపారు. దేశంలోని అనేక సామాజిక తరగతులు, వర్గాలకు సమాన హక్కులు లభించాల్సి ఉందని, అందుకోసం తాము నిరంతరం పోరాడుతూనే ఉన్నామని అన్నారు.
ఇప్పటివరకు జనాభా, కుల గణన చేపట్టలేదని, రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) 63 మంది ఎంపీలతో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వాన్ని నిలదీసి దేశంలోని లక్షలాది మంది కూలీలకు ఉపాధినివ్వడానికి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. బడుగు, బలహీన, పేద రైతులు, కార్మికులకు ఉపయోగపడే అనేక చట్టాలను పోరాడి సాధించామన్నారు. గిరిజనులకు, ఆదివాసులకు లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించి పట్టాలిప్పించామని చెప్పారు. రాజకీయాలను కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ భ్రష్టు పట్టించాయని, ఫిరాయింపులను ప్రోత్సహించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వారు ఓటు అడగడానికి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీని కూడా అడగాలని, మీ అభ్యర్థులు గెలిస్తే బీజేపీలోకి వెళ్లరనే గ్యారంటీ ఇవ్వాలని అడగాలని అన్నారు. బూర నర్సయ్యగౌడ్‌ బీసీ అని ముందుకు వస్తున్నారని, ఆయన బీసీ అయినా.. బీసీలను అణగదొక్కే అగ్రవర్ణాల పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయం మరువొద్దన్నారు.
పోరాడే వ్యక్తులకు, శక్తులకు బలాన్ని ఇవ్వాలని, ఆ వ్యక్తుల, శక్తుల చేతికి ఆయుధాన్ని ఇవ్వాలని.. అలా ఇస్తే మరింత పదునుగా పోరాడతారని చెప్పారు. అందుకే కమ్యూనిస్టులను చట్టసభల్లోకి పంపించాలని, మచ్చలేని జహంగీర్‌ను భువనగిరి నుంచి గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి పేరు ప్రతిష్టలు నిలపాలని వేడుకున్నారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలిసిన జహంగీర్‌తోనే పరిష్కారం కూడా సాధ్యమన్నారు. గతంలో రామన్నపేట నియోజకవర్గంగా ఉండి అనేక డివిజనల్‌ ప్రభుత్వ ఆఫీసులు ఉండేవని, ప్రస్తుతం ఒక్కొక్కటి మాయమవుతున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రి 50 ఏండ్లు పూర్తిచేసుకుని శిథిలావస్థకు చేరిందన్నారు. 30 మంది డాక్టర్లకు ముగ్గురు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే జహంగీర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నల్లగొండ చిట్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో తమ్మినేని, చెరుపల్లి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి మహమ్మద్‌ జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి, కల్లూరి మల్లేశం, ఆనగంటి వెంకటేశం, నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, జల్లెల పెంటయ్య, కూరెళ్ళ నర్సింహాచారి, మామిడి వెంకట్‌రెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్‌, జిల్లా అధ్యక్షులు గంటెపాక శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love