బీజేపీతో దేశ సమైక్యతకు ముప్పు

– ఎన్డీయే మళ్లీ గెలిస్తే రాజ్యాంగం రద్దు
– ప్రభుత్వరంగముండదు, రిజర్వేషన్లుండవు
– రాజకీయాలు వ్యాపారమయం
– ధరల నియంత్రణలో మోడీ సర్కారు విఫలం
– విద్యుత్‌ సవరణ బిల్లు అమలైతే ఉచిత కరెంట్‌ ఉండదు
– కేంద్రం బ్లాక్‌మెయిలింగ్‌లో భాగమే రేవంత్‌కు నోటీసులు : మీట్‌ ద ప్రెస్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశ సమైక్యతకు, సమగ్రతకు బీజేపీతో ముప్పు పొంచి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుందనీ, ప్రభుత్వరంగం ఉండబోదనీ, రిజర్వేషన్లు తొలగించబడతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వీరయ్యతో మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తన పదేండ్ల పాలనను చూపి ప్రజలను ఓట్లడిగే పరిస్థితి లేదన్నారు. అందుకే మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని విమర్శించారు. మతాన్ని, దేవుణ్ని, రాముణ్ని చూపి ఓట్లడగడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజకీయాల్లో విలువలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 13న పోలింగ్‌ జరిగే ఎన్నికల్లో పోటీ చేసే వారిలో 246 మంది అభ్యర్థులు హత్యలు, లైంగికదాడులకు పాల్పడిన వారున్నారని వివరించారు. రాజకీయాలు వ్యాపార మయమయ్యానని చెప్పారు. ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడిన గెలిచిన తర్వాత రాబట్టుకునే పనిలో రాజకీయ నాయకులుంటున్నారని అన్నారు. రాజకీయాల్లో విలువలను పున:ప్రతిష్ట చేయాల్సిన అవసరముందన్నారు. పార్లమెంటులో సీపీఐ(ఎం), వామపక్షాల ప్రాతినిధ్యం పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను ప్రభావితం చేయగలిగేలా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని అన్నారు.
కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్లు మాఫీ
గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయని వీరయ్య చెప్పారు. ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్‌ ధరలు తగ్గితే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలతోపాటు నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారనీ, పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలివ్వాలని చెప్పారు. కానీ నిరుద్యోగం తీవ్రంగా పెరిగిందన్నారు. రైతులకు పంటలకు మద్దతు ధర అడిగితే దాడులు చేస్తున్నారని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారనీ, అది నెరవేరలేదని అన్నారు. కానీ కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారని విమర్శించారు. అదానీ, అంబానీ ఆస్తులు విపరీతంగా పెరిగాయన్నారు. రూ.53 వేల కోట్లున్న అదానీ ఆస్తి నేడు రూ.17 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. అదానీ అక్రమంగా సంపాదించారంటూ ఆధారాలతో సహా బయటపెట్టినా మోడీ ప్రభుత్వం కనీసం విచారణకు ఆదేశించలేదని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నారనీ, ఎల్‌ఐసీ, స్టీల్‌ప్లాంట్‌ వంటి వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు అమల్లోకి వస్తే ఉచిత కరెంటు ఉండబోదని చెప్పారు. ప్రజలకు సబ్సిడీలు ఎత్తేస్తారనీ, కరెంటు బిల్లులు రెండు, మూడు రెట్లు పెరుగుతాయని అన్నారు. రవాణారంగం సవరణ చట్టం తెచ్చారనీ, దీంతో భవిష్యతుల్లో ఆర్టీసీలు మిగిలే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేశారని గుర్తు చేశారు.
రాచరిక పాలనవైపు మోడీ అడుగులు
మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తున్నదని వీరయ్య విమర్శించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయని అన్నారు. ప్రశ్నించే వారి మీద దాడులు చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. దారికొస్తావా? లేదా అరెస్టు చేయాలా? అనే పద్ధతిని పాటిస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, కవితను అరెస్టు చేశారని వివరించారు. బ్లాక్‌మెయిలింగ్‌లో భాగమే సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులిచ్చారని చెప్పారు.
ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే నాయకుడు, ఒకే రాజు అంటూ నిరంకుశ పాలనవైపు, రాచరిక పాలనవైపు మోడీ అడుగులు వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ మ్యానిఫెస్టోలో చివరి పేజీలో మోడీ రాజదండం పట్టుకుని ఉన్న ఫొటో ముద్రించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆ పార్టీ మళ్లీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు, లేదా నామమాత్రం అవుతాయన్న చర్చ బలంగా ఉందన్నారు. మెజార్టీ మతం ఓట్లు పొందాలని కుట్ర చేస్తున్నదని అన్నారు. మోడీని ఓడించడం కోసమే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. ఆ దిశగానే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నదని చెప్పారు. సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. రాష్ట్రంలో భువనగిరిలో సీపీఐ(ఎం)ను, మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె విరాహత్‌ అలీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

Spread the love