న్యాయ వ్యవస్థకు తూట్లు పొడిచే బిల్లుపై 28వ వారానికి చేరిన నిరసనలు

జెరూసలెం: న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బిల్లు తీసుకొస్తున్న ఇజ్రాయిల్‌లోని పచ్చి మితవాద నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. వరుసగా 28వ వారం కూడా వేలాది మంది టెల్‌ అవీవ్‌ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నెతన్యాహు మరో వైపు అనారోగ్యంతో శనివారం ఆసుపత్రి పాలయ్యాడు. నెతన్యాహు ప్రభుత్వం ఈ బిల్లులో కీలక భాగానికి సంబంధిం ప్రాథమిక ఆమోదం పొందింది. ఈ నెల చివరి నాటికి దీనిని చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే అంత తేలిక కాకపోవచ్చు. ఈ బిల్లు చట్టంగా మారడానికి మరో రెండు దశల్లో ఓటింగ్‌ అవసరమవుతుంది. దీనికి అదే స్థాయిలో ప్రతిఘటన కూడా పెరుగుతోంది. శనివారం టెల్‌ అవీవ్‌లో పది వేల మంది నిరసనకారులు న్యాయవ్యవస్థను కాపాడాలంటూ ప్రదర్శన నిర్వహించారు. ‘ఎస్‌ఒఎస్‌’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని, గులాబీ, కాషాయ రంగు పౌడర్‌ను గాలిలోకి విసురుతూ నిరసన తెలిపారు. జెరూసలెంలోని నెతన్యాహు నివాసం ఎదుట కాగడాలతో నిరసన తెలిపారు. ఇజ్రాయిల్‌లోని ప్రధాన పట్టణాలన్నీ శనివారం నిరసనలతో హౌరెత్తాయి. బహుళ ప్రాచుర్యం పొందిన టివి సిరీస్‌లోని పాత్రలను పోలిన రెడ్‌ రోబ్స్‌ వేష ధారణలో మహిళలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే తమ హక్కులన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుందన్న ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకుంటే సరే, లేక పోతే దేశవ్యాపిత సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని, మొత్తం ఆర్థిక వ్యవస్థే స్తంభించిపోయేలా చేస్తామని జాతీయ కార్మిక సంఘ నాయకుడు ఆర్మాన్‌ బార్‌ డేవిడ్‌ హెచ్చరించారు.
న్యాయ వ్యవస్థను దెబ్బ తీసే ఆలోచనను విరమించుకోవాలని మిలిటరీ అధికారులు, యుద్ధ విమాన పైలెట్లు, వ్యాపారవేత్తలు నెతన్యాహును కోరారు.ఈ ఏడాది జనవరిలో నెతన్యాహు ప్రధానిగా తిరిగి పగ్గాలు చేపట్టిన వెంటనే న్యాయవ్యవస్థపై దాడి మొదలెట్టాడు. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ అంతటా పెద్దయెత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి.నెతన్యాహు ఇప్పటికే పలు అవినీతి కుంభ కోణాల కేసుల్లో ఇరుక్కున్నాడు. పలు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుల్లో శిక్ష పడకుండా తప్పించుకోడానికే న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీసేందుకు ఆయన యత్నిస్తున్నాడని పరిశీలకులు పేర్కొన్నారు.

Spread the love