మహిళల కీర్తి పెంచిన కేసీఆర్‌ సర్కార్‌

– రాష్ట్ర మహిళా సంక్షేమ
– దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు
నవ తెలంగాణ-విలేకరులు
తెలంగాణలో మహిళల కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వాటిద్వారా మహిళల కీర్తి పెరిగిందని మంత్రులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం సభలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొని మాట్లాడారు. గతంలో అవకాశాలు లేక మహిళలు వెనుకబడి ఉన్నారని, కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ తొమ్మిదేండ్లలో మహిళలు స్వయం సమృద్ధి చెందుతున్నారన్నారు. రోహిణిలో కూడా నీళ్లు బిందెలు పట్టుకొని మహిళలు రోడ్డుపై నిలబడే దృశ్యాలు నేడు లేవన్నారు. హౌంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ఇస్లాం మతంలో స్త్రీ సంక్షేమానికి, భద్రతకు తెలంగాణ అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఐ.ఏ.ఎస్‌. ఐ.పీ.ఎస్‌ మహిళా అధికారులకు మన రాష్ట్రంలో ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీత లక్ష్మరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. మహిళా అధికారులు స్మిత సబర్వాల్‌, శిఖ గోయల్‌,ప్రియాంక, భారతి తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్‌ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, త్వరలో న్యూట్రిషన్‌ కిట్‌, ఆరోగ్యలక్ష్మి, ఆరోగ్య మహిళ, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఇంటింటికి మంచి నీటిని కేసీఆర్‌ సర్కార్‌ అందిస్తోందన్నారు. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆడపిల్లల పెండ్లిండ్లకు సాయం చేశామన్నారు. అంగన్వాడీలకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా తెలంగాణలో రూ.13,500 వేతనం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడారు. సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో ఆమె కుటుంబంతో పాటు సమాజం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని నమ్మే నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. అందుకే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎక్కువగా మహిళల కోసం రూపొందించినవే ఉన్నాయని తెలిపారు. కాగా, సంబురాల్లో మహిళా ప్రతినిధులు, ఉద్యోగులు బతుకమ్మలు, బోనాలతో హాజరయ్యారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో పేర్చిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

Spread the love