కండ్లల్లో పొడిచి..కత్తితో దాడి చేసి..యువతి దారుణ హత్య

– వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఘటన
నవతెలంగాణ-పరిగి
యువతి దారుణ హత్యకు గురైన ఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్‌ గ్రామంలో ఆదివారం జరిగింది. పరిగి ఎస్‌ఐ విట్టల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాడ్లాపూర్‌ గ్రామానికి చెందిన జుట్టు శిరీష(17)వికారాబాద్‌లోని శారద హాస్పిటల్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కాగా, తల్లి అనారోగ్య సమస్యల కారణంగా శిరీష.. ఇంట్లో ఉంటుండగా.. శనివారం ఇంట్లో వంట చేయలేదు. దాంతో ఆమె తమ్ముడు శ్రీను వాళ్ల అక్క భర్త అయిన బావ అనిల్‌కుమార్‌కు ఫోన్‌ చేసి శిరీష అన్నం వండటం లేదని చెప్పాడు. అనిల్‌ వీరి ఇంటికి వచ్చి శిరీషను మందలించడంతో పాటు కొట్టడంతో వారి మధ్య గొడవ జరిగింది. దాంతో తవ్ర మనస్తాపానికి గురైన శిరీష రాత్రి 10:30గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని గోనె మైసమ్మ గుడి సమీపంలోని చెరువు కుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. దాంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, శిరీష మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె రెండు కండ్లుపై పొడిచిన గాయాలు ఉండగా, పెదవికి కూడా గాయమైనట్టు గుర్తించారు. ఎడమ కాలుకు, ఎడమ మణికట్టుకు గాయాలై రక్తం కారింది. మృతురాలి శరీరంపై గాయాలను బట్టి శిరీషను చంపి కుంటలో పడేశారని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న జుట్టు శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ చెప్పారు.

 

Spread the love