బీజేపీ కుట్రలను తిప్పి కొట్టండి

–  ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే అడ్డుకుంటాం ..
– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌
– పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవ తెలంగాణ- సిద్దిపేట అర్బన్‌/విలేకరులు
బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు దఫాల్లో దశల వారీగా ఉపాధి హామీ చట్టాన్ని నేరుగార్చే ప్రయత్నం చేస్తోందని, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని డిమాండ్‌ చేస్తూ వ్యకాస, భారతీయ కిసాన్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ప్రసాద్‌ పాల్గొని మాట్లాడారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టానికి రూ.73 వేల కోట్లు ఉన్న బడ్జెట్‌ను రూ.63 వేల కోట్లకు కోత విధించారని తెలిపారు. పని ప్రదేశంలో ఉదయం ఏడు గంటలకు ఒకసారి, సాయంత్రం ఐదు గంటలకు మరోసారి ఫొటో దించి.. వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే చేసిన పనికి వేతనాలు ఇస్తామని చెప్పటం దుర్మార్గమైన చర్య అన్నారు. జాబ్‌ కార్డులు, బ్యాంక్‌ అకౌంట్లను ఆధార్‌ కార్డుకు లింక్‌ చేయాలనే నిర్ణయం సరైంది కాదన్నారు. చేసిన పనికి వారం రోజుల లోపల వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్నా ఎక్కడా అమలు చేయడం లేదని ఆరోపించారు. చేసిన పనికి మూడు నెలలు, నాలుగు నెలలు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. సిద్దిపేట జిల్లా కార్యదర్శి రాళ్ళబండి శశిధర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో వేతనాలు వెంటనే చెల్లించాలని, పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించి పనిముట్లు ఇవ్వాలన్నారు. 200 రోజుల పని దినాలు పెంచి, పని అడిగిన వెంటనే పని చూపించాలని, స్థానికంగా పేరుకుపోయిన సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించి ఉపాది హామీని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్‌ మావో, నాయకులు వెంకట చారి, ఉల్లంపల్లి నరసవ్వ, చంద్రం ప్రమీల, రవి, శ్రీనివాస్‌ రెడ్డి,బ్రహ్మం, పెంటయ్య, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, భారతీయ కిసాన్‌ మజ్దూర్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. వ్యవసాయం లేని వేసవిలో పేద కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టం రద్దు కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఇప్పటికే బెంగాల్‌, ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేసిందని చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌లో సూపరెంటెండెంట్‌ బి.వెంకటేశ్వరర ావుకి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా కార్యదర్శి కడియాల మోహన్‌ మాట్లాడుతూ.. ఉపాధి హమీ చట్టాన్ని ఎత్తివేత కుట్రను అపకపోతే బీజేపీని గద్దె దించుతామని హెచ్చరించారు.
నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతనం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఏశాల గంగాధర్‌, పెద్ది వెంకట్రాములు, నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీల పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని, పని ప్రదేశంలో తాగేనీరు, టెంట్‌, మెడికల్‌ కిట్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాయిలు, సత్తయ్య, రఘురామ్‌, శేఖర్‌, లాలయ్య, లక్ష్మణ్‌, విజరు, వెంకటయ్య, గోపాల్‌, ప్రభు, బాబు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Spread the love