పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

– వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలి :సీపీఐ(ఎం) నేతలు చెరుపల్లి సీతారాములు, ఎస్‌. వీరయ్య
– వరంగల్‌, హన్మకొండ ముంపు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) బృందం పర్యటన
నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన గుడిసెవాసులకు వెంటనే ఇండ్లను నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుకుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం వరంగల్‌, హన్మకొండ నగరాల్లోని ముంపు ప్రాంతాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్యతో కలిసి చెరుపల్లి సందర్శించారు. హన్మకొండ నగరంలోని గోపాలపురం చెరువు ప్రాంతంలో భారీ వర్షాలకు గుడిసెలు కొట్టుకుపోయి కట్టు బట్టలతో మిగిలిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గోపాలపురం చెరువు వద్ద పేదలు వేసుకున్న గుడిసెలు భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో పేదలు కట్టుబట్టలతో మిగిలారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద కాలువను భద్రకాళి చెరువులోకి మళ్లిస్తే గోపాలపురం చెరువుకు నీరు వచ్చే అవకాశం లేదన్నారు. అధికారులు ఈ విషయం తెలిసినా, అలా చేయకుండా వరదను ఇటు మళ్లించడంతో గుడిసెలు కొట్టుకుపోయాయని తెలిపారు. తమ పార్టీ స్థానిక నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్య పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి పరిష్కారానికి కృషి చేస్తారని బాధితులకు భరోసా ఇచ్చారు. వరద ముంపు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో బాధితుల ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రధానికి పట్టింపేది..? : ఎస్‌. వీరయ్య
రాష్ట్రంలో భారీ వర్షాలతో అనేక గ్రామాలు, నగరాలు మునిగినా ప్రధాన మంత్రికి పట్టింపు లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య విమర్శించారు. రాష్ట్రంలో వరదలతో భారీ నష్టం వాటిల్లినా ప్రధాని స్పందించి ఏరియల్‌ సర్వే చేసిన దాఖలాలు లేవన్నారు. తాము బాధితులను పరామర్శించే వరకు కూడా అధికారులు ఈ ప్రాంతాలను సందర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. అధికారులకు కనీసం సోయి లేకుండా పోయిందని విమర్శించారు. మడికొండ రైల్వే ట్రాక్‌ కింద కల్వర్ట్‌ వెడల్పు పెంచితే ఎంఎన్‌ నగర్‌ మునిగేది కాదన్నారు. చిన్న జాగ్రత్త తీసుకుంటే ఇంత విపత్తు సంభవించేది కాదని చెప్పారు. వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో రూ.474 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఏ ప్రాంతంలోనూ పరిశీలించకుండానే అధికారులు ఏ ప్రాతిపదికన నష్టాన్ని అంచనా వేశారని ప్రశ్నించారు. ఇప్పుడు వరదలు వస్తే.. ఆ నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఇచ్చే దుస్థితి వుందని ఆవేదన వ్యక్తం చేశారు. మడికొండ ఎంఎన్‌ నగర్‌లో బాధిత మహిళల రోదన హృదయ విదారకంగా వుందన్నారు. భద్రకాళి చెరువును టూరిజం స్పాట్‌ చేయడానికి చెరువు చుట్టూ గోడ కట్టి కట్ట వద్ద వదిలేశారని, దీంతో అదే ప్రాంతంలో గండి పడి పలు కాలనీలు మునగిపోయాయని చెప్పారు. పోతననగర్‌కు వచ్చినవాళ్లంతా గండిని చూసి పోతున్నారని, మా బతుకులు ఎవరూ చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పోతననగర్‌లో చాలా ఇండ్లు కూలిపోయాయన్నారు. భారీ వర్షాలతో కూలిపోయిన పేదల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, కిరాణ సామానును పేదలకు పంపిణీ చేయాలన్నారు. దెబ్బతిన్న ఇండ్లను సర్కారే మరమ్మతులు చేయించాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున్న వెంటనే మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా జిల్లా కన్వీనర్‌ బొట్ల చక్రపాణి, కమిటీ సభ్యులు వాంకుడోతు వీరన్న, సారంపల్లి వాసుదేవరెడ్డి, టి.ఉప్పలయ్య, గొడుగు వెంకట్‌, మిశ్రిన్‌ సుల్తాన తదితరులు ఉన్నారు.

Spread the love