హక్కు పత్రాలిస్తామనడం హర్షణీయం

– ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
– గిరిజనుల వల్ల అడవి నాశనం కావడం లేదు : పోడు భూములపై సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
రాష్ట్రంలో 11.5 లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాలిస్తామంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. పోడు పట్టాలతోపాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తామంటూ చెప్పడం సంతోషకరమని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది గత కొంతకాలంగా సీపీఐ(ఎం), కమ్యూనిస్టులు, గిరిజనులు, పలు సంఘాలు చేస్తున్న ఉద్యమ పోరాట ఫలితమేనని తెలిపారు. ఇప్పటికైనా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీని కచ్చితంగా నిలబెట్టుకోవాలనీ, వెంటనే అమలు జరిగేటట్టు చూడాలనీ కోరారు. గిరిజనులు అడవులను ఆక్రమిస్తే పోడు పట్టాలను రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారని పేర్కొన్నారు. వాస్తవానికి అవినీతి అటవీ అధికా రులు, రాజకీయ నాయకుల అండతో స్మగ్లర్లు అడవులను నాశనం చేస్తున్నారని విమర్శించారు. అంతే తప్ప గిరిజనుల వల్ల నాశనం కావడం లేదని తెలిపారు. ఒకపక్క తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ అడవి పెరిగిందంటూ స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నదానికి విరుద్ధంగా గిరిజనులే అడవులను నాశనం చేస్తున్నారని మాట్లాడటం సరైంది కాదని పేర్కొన్నారు. ఆదివాసీలున్న ప్రాంతాల్లో ఎక్కడా అడవి నాశనం కాలేదని గుర్తు చేశారు. అడవులను కాపాడుకోవడంలో గిరిజనులు, ప్రజలందరూ బాధ్యత వహించే విధంగా చూడాలని సూచించారు. గుత్తికోయలు ఎక్కడినుంచి వచ్చిన వారైనా చట్టప్రకారం వారికి హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. గుత్తికోయలను హక్కుదారులు కాదనడం సరైంది కాదని తెలిపారు. వారిపట్ల సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love