చరిత్రకు మసిపూయలేరు

History cannot be forgotten– సాయధ పోరాటానికి మతం రంగు పులుముతున్నారు
– మోడీ సర్కార్‌ చెప్పేదొకటి…చేసేదొకటి…
– అబద్ధాలు…వక్రీకరణలతో కేంద్రంలో పాలన
– విద్వేషాలతో విభజన రాజకీయాలు …
– బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకునేది ఎర్రజెండానే 
– తెలంగాణ రైతాంగ సాయుధపోరాట
– వార్షికోత్సవ సభలో బృందాకరత్‌
– కమ్యూనిస్టుల నేతృత్వంలో సాగిన ప్రజాయుద్ధమది
– ఏ సంబంధమూలేని శక్తులు వక్రీకరణలకు పాల్పడుతున్నాయి
– ఏ అర్హతతో సాయుధ పోరాటం గురించి మాట్లాడుతున్నారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి… చేసేది మరొకటి అని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. పూర్తి అబద్ధాలు, వక్రీకరణలు, విద్వేష ప్రసంగాలతో వారు దేశాన్ని పాలిస్తున్నారని చెప్పారు. కులమతాలతో సంబంధం లేకుండా, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కూడా ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దానిలో భాగమేనని వివరించారు. బీజేపీ దాని అనుబంధ సంఘాలు, ఆపార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, విభజన రాజకీయాలు చేస్తున్నారనీ, కానీ ఢిల్లీలో జరుగుతున్న జీ-20 అంతర్జాతీయ సదస్సులో ‘విద్వేషాలు వద్దు’ అనే తీర్మానాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టి, ఆమోదించుకున్నారని ఎద్దేవా చేశారు. చెప్పే మాటకు, చేసే పనికి సంబంధమే ఉండదని అన్నారు. బ్రిటీషర్లకు సలాం కొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఇప్పుడు తెలంగాణ విమోచన దినం జరుపుతామని బయల్దేరాయన్నారు. సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం పార్కు వద్ద ‘తెలంగాణ సాయుధ పోరాట (2946-51) వార్షికోత్సవాలు నిర్వహించారు. దీనికి బృందాకరత్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు ఆనాడు బ్రిటీషర్లు, నిజాం, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేశారనీ, దాని ఫలితంగానే హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని వివరించారు. అనేక త్యాగాలతో కులమతాలకు అతీతంగా ఐక్యంగా జరిగిన పోరాట చరిత్రను మత ఘర్షణలుగా చిత్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దాని అనుబంధ సంస్థలు ప్రచారం చేస్తున్నాయనీ, అలాంటి చర్యల్ని సహించబోమని హెచ్చరించారు. ప్రజాపోరాటం ఉధృతంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ఆర్య సమాజ్‌ పేరుతో, జమ్మూ కాశ్మీర్‌లో ప్రజా పరిషత్‌ పేరుతో రాజులు, రాచరికాలకు అనుకూలంగా ప్రజల్లో విభజన తెచ్చే చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. కానీ భూమి మాది…దేశం మాది అనే కమ్యూనిస్టుల నినాదానికి తలవంచక తప్పలేదన్నారు. మణిపూర్‌లోని ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ గ్రామాల్లో ఉద్రిక్తతలు సృష్టించి, అమాయక గిరిజనుల్ని ఊచకోత కోస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనీ, కండ్ల ముందే తండ్రిని, సోదరుడిని చంపి, నగంగా ఊరేగిస్తూ, సమూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అల్లర్లకు డబుల్‌ ఇంజిన్‌ సర్కారే కారణమనీ, అల్లర్ల నియంత్రణలో చేతులెత్తేసి, చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మరోవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నదనీ, రాత్రికి రాత్రే వాళ్లు లక్షల కోట్లకు అధిపతులు అవుతున్నారని అన్నారు. గ్రామీణంలోని పేదలు మాత్రం సరైన ఉపాధి లేక పనికి ఆహారం పథకం (నరేగా) ద్వారా రోజువారీ ఆదాయంతో బతుకులు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రం ఘోరంగా విఫలమైందని చెప్పారు. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం వంటి నేతల ఆదర్శాలు, స్ఫూర్తితో… మతోన్మాద శక్తులు, ప్రజాకంటక ప్రభుత్వాల బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకుంటామనీ, ఎర్రజెండా ఎప్పుడూ పేదల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వాలతో కొట్లాడుతున్నామనీ, అంతిమ విజయం సాధించేదాకా విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినంలో పాల్గొనేందుకు అమిత్‌షా, రాహుల్‌గాంధీలకు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన వారే సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ వచ్చి వేడుకలు నిర్వహిస్తామని చెప్తున్నారనీ, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముందని ప్రశ్నించారు. ఆ పోరాటం కమ్యూనిస్టుల సొత్తు, హక్కు అని నినదించారు. పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో జరిగిన ప్రజా సాయుధపోరాటం వల్లే భారతదేశంలో హైదరాబాద్‌ స్టేట్‌ విలీనం సాధ్యమైందని తెలిపారు. దొడ్డి కొమురయ్య, బందగీ, షోయబుల్లాఖాన్‌, మగ్దూం మొహియుద్దీన్‌ వంటి సాయుధ పోరాట యోధులు ప్రజల కోసం బలిదానాలు చేశారని గుర్తుచేశారు. ఆనాడు సర్దార్‌ పటేల్‌, నెహ్రూ ప్రజల్ని పీడించిన నిజాంను జైల్లో పెట్టకుండా, రాజ్‌ప్రముఖ్‌ పేరుతో సత్కరించి, ప్రజా పోరాటాన్ని అవమానపరిచారని అన్నారు. పటేల్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ వచ్చిన సైన్యాన్ని ఇక్కడి కమ్యూనిస్టు ప్రజలపైకి ఉసిగొల్పి, దారుణ మారణకాండకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చరిత్ర ఉన్న నేతలు ఇప్పుడు విలీన దినోత్సవాలంటూ నాటకాలాడుతున్నారని అన్నారు. సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వమనీ, భారతదేశానికి భవిష్యత్‌ దిశానిర్దేశం వారితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమానికి సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎమ్‌ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, టీ జ్యోతి, సీనియర్‌ నాయకులు ఎస్‌ మల్లారెడ్డి, రఘుపాల్‌, పీఎస్‌ఎన్‌ మూర్తి, నంద్యాల నర్సింహారెడ్డి, సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు నాగలక్ష్మి, ఎమ్‌ మహేందర్‌,ఎం.దశరథ, కేఎన్‌ రాజు, శ్రీనివాస్‌, వెంకటేష్‌,మారన్న తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో సాయుధ పోరాట చరిత్రను తెలుపుతూ ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ అనంతరం సుందరయ్య పార్కు నుంచి చిక్కడపల్లి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు ఎర్రజెండాలు, ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు.

Spread the love