బ్రెజిల్‌కు జీ-20 అధ్యక్ష బాధ్యతలు

G-20 for Brazil Presidential Responsibilities– మహిళా సాధికారతకు పెద్దపీట..
– అందరికీ ఆహార భద్రతపై తీర్మానాలు
–  డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం సుధీర్ఘ చర్చ..ముగిసిన సదస్సు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన జీ-20 సదస్సు ముగిసింది. సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ నవంబర్‌లో సభ్య దేశాల అధినేతలు వర్చువల్‌గా సమావేశమవ్వాలని, ప్రస్తుత సదస్సులో తీసుకున్న నిర్ణయాలను, వచ్చిన సూచనలను మరోసారి సమీక్షించుకో వాలని ప్రతిపాదించారు. జీ-20 అధ్యక్ష పదవిలో భారత్‌ నవంబర్‌ 30వ తేదీ వరకూ అధికారికంగా కొనసాగుతుందని చెప్పారు. అంతకుముందు ఆయన జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించి, శుభాకాంక్షలు తెలిపారు. బ్రెయిల్‌ ఈ బాధ్యతలను డిసెంబర్‌ 1న అధికారికంగా చేపడుతుంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించిన వివాదాస్పద పేరాగ్రాఫ్‌ల పై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ పరిణామాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. కాగా అతిథుల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. చారిత్రక సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ అభినందించారు. జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రుడెయూతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చైనా ఆర్థిక మంత్రి లీ కున్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై జీ-20 సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని జపాన్‌ ప్రధాని కిషిడా తోసిపుచ్చారు. ఇది బలహీనమైన తీర్మానమని వ్యాఖ్యానించారు. అయితే ఈ తీర్మానాన్ని రష్యా కొనియాడింది. మాస్కోపై నేరుగా విమర్శలు చేయకుండా సమతూకం పాటించారని తెలిపింది. వివాదాస్పదమైన ఉక్రెయిన్‌ అంశంపై చివరి వరకూ సంప్రదింపులు కొనసాగాయని యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు తెలిపారు. భారత్‌తో అత్యున్నత స్థాయి చర్చలు కొనసాగుతాయని రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్‌ చెప్పారు. పర్యావరణంపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు సభ్య దేశాల నేతలు భారత్‌ మండపంలో మొక్కలు నాటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ సహా పలువురు నేతలు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. సదస్సు చివరి సమావేశానికి బైడెన్‌ హాజరు కాలేదు. ఆయన వియత్నాం బయలుదేరి వెళ్లారు. సునాక్‌, ఆయన సతీమణి అక్షత మూర్తి రాజధానిలోని స్వామినారాయణ్‌ అక్షరధామ్‌ను సందర్శించారు. జీ-20 డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత దౌత్యవేత్తలు 200 గంటల పాటు నిర్విరామంగా సభ్య దేశాలతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై పదిహేను ముసాయిదాలను రూపొందించి, చివరికి ఏకాభిప్రాయానికి వచ్చారు.

Spread the love