బుల్డోజర్‌ రాజ్యం !

Bulldozer kingdom!– ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మూకుమ్మడి దాడి
– అధినేత మాటే శిలాశాసనం
– ప్రతిపక్షాలకు విలువే లేదు
– అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ‘బుల్డోజర్‌’ దాడికి గురవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారత రాజకీయాలలో ఇది బుల్డోజర్‌ శకం. అది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే భవనాల పునాదులను కూల్చేస్తోంది. ఆ సౌధాలు పూర్తిగా నేలమట్టమయ్యే వరకూ అది పని చేస్తూనే ఉంటుంది. దేశంలో బుల్డోజర్‌ పాలన వేగవంతంగా వ్యాప్తి చెందుతూ అనతికాలంలోనే అన్ని వ్యవస్థలనూ సర్వనాశనం చేస్తోంది. ఆ దాడికి సిద్ధపడేందుకు, స్పందించేం దుకు ప్రతిపక్షాలకు కనీసం సమయం కూడా దొరకడం లేదు. సాధారణంగా యుద్ధ సమయాలలో శతృ దేశా లపై ఇలాంటి వ్యూహాలనే అమలు చేస్తుంటారు. శతృ దేశాలు కోలుకోలేని విధంగా ఒక్కసారిగా విరుచుకుప డతారు. ఆ సమయంలో శతృవులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోతారు. మన దేశంలో జరుగుతోంది కూడా ఇదే. మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మూకుమ్మడిగా ప్రతి పక్షాలకు వ్యతిరేకంగా తమ అజెండాను అమలు చేయడం ప్రారంభిం చాయి. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) మొదలు కొని ఒకే దేశం…ఒకే ఎన్నిక నినాదం వరకూ ప్రభుత్వం తన అజెండాను అమలు చేసేందుకు కుయుక్తులు పన్ను తూనే ఉంది. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో ‘హిందూ కోడ్‌’ను రుద్దేందుకు చేస్తున్న ప్రయ త్నాలను కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు చాలా కాలం నుండి తమ చుట్టూ రాజకీయ గూడు అల్లుకుంటున్నాయి. ప్రతి పక్షాలను అందులో చిక్కుకుని విలవిలలాడేలా చేయాలని చూస్తున్నాయి.
పాత ఆయుధాలకే పదును
వాస్తవానికి ఒకే దేశం…ఒకే ఎన్నిక విధానం 2014లోనే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఉంది. దేశంలోని మైనారిటీలపై ద్వేష భావనను వ్యాపింపజేసేందుకు ముందుకు తెచ్చిన యూసీసీ కూడా పాత ఆయుధమే. పాతబడి దుమ్ముకొట్టుకుపోయిన ఈ ఆయుధాలను లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెర పైకి తేవడం విశేషం. ప్రజాస్వామ్య మౌలిక నిర్మాణాన్ని ధ్వంసం చేయడం ద్వారా రాచరిక వ్యవస్థను తిరిగి ప్రతిష్టిం చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. మరోవైపు దేశంలోని బహు భాషా సంస్కృతికి విఘాతం కలిగించి హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా జనం పైన రుద్దే కుట్ర జరుగుతోంది. జాతీయ భాషగా హిందీకి ప్రాచుర్యం కలిగించడం, అనేక ప్రభుత్వ పథకాలకు సంస్కృత పేర్లు తగిలించడం ఇందులో భాగమే. జాగ్రత్తగా గమనిస్తే ఇందుకోసం చాలా కాలం నుండే కసరత్తు జరుగుతోందని అర్థమవుతుంది. పార్లమెంట్‌్‌ వర్షాకాల సమావేశాల నుండే ఈ అంశాలన్నింటినీ దూకుడుగా ముందుకు తెస్తున్నారు.
ఆయన మాటే వేదం
తాజాగా ఇండియా వర్సెస్‌ భారత్‌ వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. ఇండియా పేరునే చెరిపేసి భారత్‌ అని నామకరణం చేసేందుకు మోడీ ప్రభుత్వం తహతహలాడుతోంది. పాలకుడి మనసులో ఏముందో…పాలకుడి కోరిక ఏమిటో…దానినే ఆచరణలో పెట్టేందుకు వ్యవస్థ మొత్తం ఆతృత ప్రదర్శిస్తోంది. పాలకుడే సుప్రీం…ఆయన చెప్పిందే వేదం అన్న విధంగా అధికార యంత్రాంగం యావత్తూ వ్యవహరిస్తోంది. కొందరు నేతలు అత్యుత్సాహంతో అధినేత అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కళాకారులు, క్రీడా కారులు సైతం ఇందుకు తానా తందానా అంటున్నారు.
ఏ అవకాశాన్నీ వదులుకోరు సాధారణంగా బుల్డోజర్‌ ఒకే దశలో ప్రయా ణించి అడ్డువచ్చిన దానిని కూల్చేస్తూ ముందుకు సాగుతుంది. కానీ రాజకీయ బుల్డోజర్‌ అలా కాదు. అది విభిన్న దిశలలో ప్రయాణిస్తూ సున్నితమైన రాజ్యాంగ, న్యాయపరమైన ఆలోచనలకు సమాధి కడుతుంది.
జీ-20 సదస్సు గురించి విదేశాంగ మంత్రి జై శంకర్‌ మాట్లాడుతూ ‘ఇది గ్లోబల్‌ శకం. దానిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఈ సమావేశాలను ఎలా ఉపయోగించు కుంటున్నారో చూడాలని సూచించారు. అది గతంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలకు చేతకాలేదని కూడా చెప్పుకొచ్చారు.
ఫెడరల్‌ నిర్మాణమే లక్ష్యంగా…
ఒక విషయం మాత్రం సుస్పష్టం. ప్రజల అభిప్రాయాలతో పాలకులకు పని లేదు. వారు ఎలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలనైనా ఎవరినీ సంప్రదించకుండానే తీసుకోగలరు. అంటే వ్యవస్థపై ప్రజల ఒత్తిడికి, వారి అభిప్రాయాలకు విలువే లేదు. ఇప్పుడు దేశంలో బుల్డోజరే రాజకీయ అజెండాను నిర్దేశిస్తోంది. ఇందులో ప్రజలకు సంబంధించిన విషయాలకు తావే లేదు. రాజ్యాంగంలో ప్రతిపక్షాల మాటకు, విమర్శలకు విలువ ఉంది. కానీ నేటి పాలకులకు ఆ దృష్టి లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫెడరల్‌ నిర్మాణాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ఇది ఆందోళనకర, ప్రమాదకర పరిణామం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Spread the love