మహిళా సాధికారతకు పెద్ద పీట డిజిటల్‌ కార్యకలాపాలలో

A big push for women empowerment In digital operations– మహిళలకు మరింత భాగస్వామ్యం
–  డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ-20 సదస్సు
న్యూఢిల్లీ : మహిళా సాధికారతకు పెద్ద పీట వేయాలని జీ-20 సదస్సు నిర్ణయించింది. వేతన వ్యత్యాసాలు, లైంగిక హింస, ఉద్యోగావకాశాలు, ఆహార భద్రత వంటి విషయాలలో చొరవ తీసుకోవాలని, ముఖ్యంగా డిజిటల్‌ కార్యకలాపాలలో మహిళలు అధిక సంఖ్యలో భాగస్వాములయ్యేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదస్సు చివరి రోజైన జీ-20 దేశాధినేతలు డిక్లరేషన్‌ను ఆమోదించారు.
జీ-20 దేశాలలోని మహిళా మంత్రిత్వ శాఖలకు బాసటగా నిలిచేందుకు మహిళా సాధికారతపై కొత్తగా కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిక్లరేషన్‌లో తీర్మానించారు. బ్రెజిల్‌లో జరిగే తదుపరి జీ-20 దేశాల సదస్సులో ఈ కార్యాచరణ బృందం తొలి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం డిజిటల్‌ కార్యకలాపాలను మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి, మహిళలు కూడా ఆ కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సదస్సు నిర్ణయించింది. 2030 నాటికి డిజిటల్‌ కార్యకలాపాలలో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసాలను సాధ్యమైనంత వరకూ తగ్గించాలని సదస్సులో తీర్మానించారు. డిజిటల్‌ కార్యకలాపాల నిర్వహణలో మహిళలకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందించాలని, మహిళలకు డిజిటల్‌ కార్యకలాపాలు అందుబాటు ధరలో ఉండేలా చూడాలని సదస్సు తీర్మానించింది. డిజిటల్‌ అక్షరాస్యత, నైపుణ్యాలను పెంచడం సహా జాతీయ డిజిటల్‌ వ్యూహాల రూపకల్పన, అమలులో మహిళలు, బాలికలు మరింత క్రియాశీలకంగా పాల్గొనేందుకు అవసరమైన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించారు.
డిజిటలీకరణ ప్రక్రియలో భద్రతాపరంగా మహిళలు, బాలికలకు ఎదురయ్యే ముప్పును సదస్సు గుర్తించింది. ఆయా సమస్యలను గుర్తించి, వాటిని తొలగించాలని డిక్లరేషన్‌ ప్రతిపాదించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల ద్వారా మహిళలను కించపరిచే ప్రయత్నాలు జరగవచ్చునని, డిజిటల్‌ సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాలలో సురక్షితమైన విధానాలను రూపొందించుకొని వీటిని నివారించవచ్చునని అభిప్రాయపడింది. ముఖ్యంగా మహిళల నేతృత్వంలో, వారి యాజమాన్యంలోని వ్యాపారాలలో వివక్షకు తావులేని డిజిటల్‌ ఎకానమీని ఆచరణలో పెట్టాలని తీర్మానించింది.
మహిళలు, బాలికలపై వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టాలు, కాలుష్యం వంటివి చూపే ప్రభావాన్ని జీ-20 సదస్సు గుర్తించింది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు మహిళల భాగస్వామ్యం, నిర్ణయాలు తీసుకోవడంలో వారి ప్రమేయం, నాయకత్వ లక్షణాలను మరింతగా పెంచాలని నిర్ణయించింది. పర్యావరణానికి సంబంధించిన విషయాలలో నష్టాన్ని తగ్గించే వ్యూహాలను, విధానాలను రూపొందించుకోవాలని జీ-20 సదస్సు తీర్మానించింది.
వ్యవసాయ, ఆహార రంగాలలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉన్నదని సదస్సు అభిప్రాయపడింది. పాఠశాల విద్యార్థులకు సురక్షితమైన, పోషక విలువలతో కూడిన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మహిళా రైతులు చేపట్టే ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలని తీర్మానించింది. డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించి బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించింది. మహిళలకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని, వేతనాల చెల్లింపులో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని జీ-20 సదస్సు తీర్మానించింది.
అందరికీ ఆహార భద్రత…
పోషకాహారం జీ-20 దేశాధినేతల తీర్మానం
న్యూఢిల్లీ : ఆకలిని, పోషకాహార లోపాన్ని పాలద్రోలే విషయంలో ధృఢ చిత్తంతో ఉన్నామని జీ-20 దేశాధినేతలు స్పష్టం చేశారు. ఆహారం, ఇంధనం సహా నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలపై ఒత్తిడి ఏర్పడుతోందని అంటూ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు, పోషకాహారాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ మేరకు ముగిసిన జీ-20 సదస్సులో డిక్లరేషన్‌ ఆమోదించారు. పేదరికం, అసమానతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, ఘర్షణలు వంటి పరిణామాలు మహిళలు, చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని డిక్లరేషన్‌ అభిప్రాయపడింది.
‘ఉక్రెయిన్‌ యుద్ధం, దాని ప్రభావం కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆహార, ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లింది. సరఫరాలు నిలిచిపోయాయి. ఆర్థిక అస్థిరత ఏర్పడింది. ద్రవ్యోల్బణం పెరిగింది. అభివృద్ధి నిలిచిపోయింది. ఈ పరిణామాలు సభ్య దేశాలలో విధానపరమైన వాతావరణాన్ని సంక్లిష్టం చేశాయి. ముఖ్యంగా కోవిడ్‌ మిగిల్చిన నష్టాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వర్థమాన, పేద దేశాలపై ఎక్కువగా ప్రభావం పడింది. ఆర్థిక విధ్వంసం అభివృద్ధిని కుంటుపరచింది’ అని డిక్లరేషన్‌ వివరించింది. రష్యా ఆహార ఉత్పత్తులు, ఎరువులు ప్రపంచ మార్కెట్‌కి చేరడంలో తుర్కియే, ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాలు చేసిన కృషిని కొనియాడింది. ఉక్రెయిన్‌ నుండి ఆహారధాన్యాలు సురక్షితంగా రవాణా అయ్యేందుకు కూడా ఈ ఒప్పందాలు ఉపకరించాయని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్‌ల నుండి ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు, ఎరువులు వంటివి పూర్తి స్థాయిలో, సకాలంలో సరఫరా జరగడంతో వర్థమాన దేశాలు, ఆఫ్రికా వంటి పేద దేశాల అవసరాలు తీరాయని వివరించింది.
అందరికీ ఆహార భద్రత, పోషకాహారం అందించేందుకు జీ-20 సదస్సు ఆరు సూత్రాల కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొనే, పోషకాహారాన్ని అందించే పంటలపై పరిశోధనల్లో సహకారాన్ని మరింత పటిష్టపరచుకోవాలని పిలుపునిచ్చింది. స్థానికంగా ఎరువుల ఉత్పత్తిని పెంచాలని, భూ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సూచించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి ఆహార నష్టాన్ని, వృథాను తగ్గించేందుకు ఆధునీకరణ పద్ధతులు, పెట్టుబడులపై దృష్టి సారించాలని అభిప్రాయపడింది. ఆహార భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో వర్థమాన దేశాలకు చేయూత అందించాలని నిర్ణయించింది.
ఆహార, ఇంధన ధరలు గరిష్ట స్థాయి నుండి పడిపోవడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఏర్పడిందని జీ-20 సదస్సు తెలిపింది. ఈ సంవత్సరాంతానికి వ్యవసాయాభివృద్ధి వనరుల కోసం అంతర్జాతీయ నిధిని పరిపుష్టం చేయాలని నిర్ణయించింది.

Spread the love