నియంతృత్వ పాలన కోసమే జమిలీ జపం

Jamili Chant is for Dictatorship– ప్రతిపక్షాల ఐక్యతతో నరేంద్ర మోడీకి ఓటమి భయం..
– కులాన్ని సంహరిస్తేనే దేశానికి ప్రగతి
– నిజాంను కూల్చిన స్ఫూర్తితో బీజేపీని గద్దెదించేలా పోరాటాలు
– బీఆర్‌ఎస్‌కు, సాయుధ పోరాటానికి ఏం సంబంధం? : సంగారెడ్డిలో సాయుధ పోరాట వారోత్సవ సభలో బీవీ రాఘవులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఒకేసారి ఎన్నికలంటే అధ్యక్షతరహా పాలన తీసుకురావడమేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. స్థానిక సంస్థలు, రాష్ట్రాల అధికారాలను హరించి ఒకే వ్యక్తి నియంతృత్వ పాలన సాగించడం కోసమే మోడీ జమిలి జపం చేస్తున్నారని విమర్శించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సభకు రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీరనారి ఐలమ్మ విగ్రహం నుంచి పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జమిలీ ఎన్నికలైనా, సాధారణ ఎన్నికకైనా సీపీఐ(ఎం) సిద్ధంగా ఉన్నదన్నారు. దేశంలో ప్రతిపక్షాలు ఐక్యమవుతుండటంతో మోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామన్న నిజాన్ని గమనించే జమిలీ ఎన్నికలకు పోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశం సాధించిన గొప్పతనమంతా తమ వల్లే జరిగినట్టుగా మోడీ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నారన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న చరిత్ర బీజేపీకి కాని, దాని మాతృ సంస్థలైన జనసంఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కూ లేవన్నారు.
ఆనాడు దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంటే పేరిట అడ్డుకొని జమీందార్లకు అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర సంఫ్‌ు పరివార్‌దన్నారు. ప్రస్తుతమూ కార్పొరేట్ల పక్షమే వహిస్తూ రైతు నల్ల చట్టాలు, నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చి రైతాంగం, కార్మికవర్గానికి నష్టం చేస్తున్నదని తెలిపారు. ఇండియా, భారత్‌ రెండు పదాలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయని, ఇప్పుడు భారత్‌గా మాత్రమే పేరు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను మరుగు పర్చేందుకే దేశం పేరు మార్పు, సనాతన ధర్మం చుట్టూ చర్చ జరిగేలా చేస్తున్నారన్నారు.
సనాతన ధర్మాన్ని కాపాడటమంటే కుల వ్యవస్థను కొనసాగించడమేనని స్పష్టంచేశారు. సనాతన ధర్మమని చెప్పబడుతున్న మనుస్మృతిలో ఆడవాళ్లు, శూద్రులు, దళితులు చదువుకోరాదని, వేదాలు చదివితే నాలుక కోయాలని, వింటే చెవ్వుల్లో సీసం పోయాలని చెప్పబడిందన్నారు. వీటన్నింటినీ కొనసాగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులు చెప్పగలవా అని ప్రశ్నించారు. కులాన్ని సంహరించాలని బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే చెప్పారన్నారు. కులాన్ని సంహరిస్తేనే దేశానికి ప్రగతి ఉంటుందని, తాను సైతం కులాన్ని నిర్మూలించాల్సిందేనని చెబుతున్నానని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హిందూ మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.జీ-20 దేశాల సమావేశాలు ఆయా దేశాల్లో రొటీన్‌గా జరిగే ప్రక్రియ తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు.
దేశ ప్రజలకు సంబంధించిన అధిక ధరలు, నిరుద్యోగం, రైతులకు మద్దతు ధర, రాజ్యాంగ పరిరక్షణ, మహిళా రిజర్వేషన్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై పోరాటాలు సాగించాలని ప్రజలను కోరారు. వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు నిజాం నవాబును తరిమికొట్టిన స్ఫూర్తితో దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీని గద్దె దించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది : చుక్క రాములు
నిజాం పాలనలో భూములన్నీ జాగీర్దార్లు, జమీందార్ల చేతుల్లో ఉండేవని, వారికి వ్యతిరేకంగా భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం సాగించి లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నా రు. సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ వాస్తవ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు.
పుచ్చలపల్లి సుందరయ్య, రావినారాయణరెడ్డి, భీంరెెడ్డి నర్సింహ్మరెడ్డిలాంటి కమ్యూనిస్టుల యోధులు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బీరం మల్లేశం, కె. రాజయ్య, అతిమేల మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు యాదవరెడ్డి, నర్సింలు, ప్రవీణ్‌ కుమార్‌, ఎం. యాదగిరి, జిల్లా నాయకులు బాగారెడ్డి, రాజయ్య, అశోక్‌, పాండురంగారెడ్డి, పి. కృష్ణ, నాగభూషణం పాల్గొన్నారు.
కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు
వీర తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని రాఘవులు పునరుద్ఘాటిం చారు. నిజాం ప్రభువు లొంగిపోయినందునే సెప్టెంబర్‌ 17కు ప్రాధాన్యత సంతరించుకున్నదన్నారు. నిజాం లొంగిపోయేలా పోరాడిన కమ్యూనిస్టుల త్యాగాలను గుర్తించకుండా బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు తామేదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాయ న్నారు. వెట్టి నుంచి ప్రజలను విముక్తి చేసి భూముల్ని పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. దేశ సమైక్యతా దినంగా పాటిస్తున్నామని చెబుతున్న బీఆర్‌ఎస్‌ లేదా ఆ నాటి టీఆర్‌ఎస్‌కు సాయుధ పోరాటానికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. వెట్టికి వ్యతిరేకంగా మట్టి మనుషులు సాగించిన విరోచితమైన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతుందన్నారు. నిజాం ముస్లింగా ప్రజలంతా హిందువులుగా చెబుతూ రాజకీయ లబ్దిపొందేందుకు అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Spread the love