కనీస వేతనాలు కరువు

– అమలు కాని కాంట్రాక్టు లేబర్‌ యాక్ట్‌
– పదేండ్లుగా ఆగని పోరు..
– ఈ నెల 4 నుంచి 13 వరకు జీపు జాతా
– 17న 33 జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
– సలహా మండలి సిఫారసులు పట్టని ప్రభుత్వం
73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌లో పనిచేస్తున్న కార్మికులకు పదిహేనేండ్లుగా కనీస వేతనాలు సవరించలేదు. ప్రయివేట్‌ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు జీతభత్యాలు పెరగకపోవడంతో తీవ్రంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. పెరిగిన ధరలకనుగుణంగా ఐదేండ్లకోసారి వేతనాల్ని పెంచాలని చట్టం చెబుతున్నా సర్కార్‌కు పట్టించుకోవడం లేదు. మూడు సార్లు కనీస వేతన సలహా మండలిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ మండలి చేసిన ఏ ఒక్క సిఫారసుల్ని కూడా అమలు చేయలేదు. కాంట్రాక్టు లేబర్‌ యాక్ట్‌, 1979 అంతరాష్ట్ర వలస కార్మిక చట్టాలేవీ రాష్ట్రంలో అమలు కావడంలేదు. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కనీస వేతనాలు సాధించుకునేందకు కార్మికులు పోరు బాటపట్టారు. ఈ నెల 4 నుంచి 13 వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో జీపుజాత చేయబోతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో వేలాది భారీ, మధ్యతరహా పరిశ్రమలు విస్తరించాయి. పారిశ్రామిక రంగంతో షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌లో కోటి మందికిపైగా కార్మికులు న్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు, పాశ మైలారం, బొంతపల్లి, బొల్లారం, హత్నూర, సదా శివపేట, కొండాపూర్‌, కంది, సంగారెడ్డి, జహీరా బాద్‌, పుల్కల్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, మనోహా రాబాద్‌, చినశంకరంపేట, ములుగు, మర్కుల్‌, గజ్వేల్‌, సిద్దిపేట ప్రాంతాల్లో పరిశ్రమలున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 30 వేల మందికి పైగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ తో పాటు దాన్ని ఆనుకొని ఉన్న పలు జిల్లాల్లో ఫార్మా సూటికల్‌, కెమికల్‌, ఐరన్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇండిస్టీ, రైస్‌మిల్లులు, స్పిన్నింగ్‌ మిల్లులు, ఆస్పిటల్స్‌, కనస్ట్రక్షన్‌, రోడ్డు భవనాలు, పౌల్ట్రీ, మ్యాన్యు ఫ్యాక్టరింగ్‌ యూనిట్స్‌, డిస్టెలరీస్‌, బ్రేవరీస్‌, మెటల్‌ పౌండరీస్‌, ఆటోమొబైల్‌, సాఫ్ట్‌డ్రింక్స్‌, ఎరెటెడ్‌, వాటర్‌ మ్యాన్యు ఫ్యాక్టరీస్‌ వేల సంఖ్యలో విస్తరించాయి. వీటిల్లో స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌, టెక్నికల్‌ కేటరిగి, అసిస్టెంట్‌ కేటగిరి, బాటిల్‌ పుల్లర్స్‌, ఆపరేటర్స్‌, అన్‌స్కిల్డ్‌ ప్యాకర్స్‌, బాయిలర్‌ హెల్పర్‌, సేల్స్‌మెన్‌, ప్లాంట్‌ ఆపరేటర్స్‌ ఇలానే అనేక రకాల పేర్లతో కార్మికులు పనిచేస్తున్నారు.
అమలు కాని కాంట్రాక్ట్‌ యాక్ట్‌, అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం పారిశ్రామిక రంగంలో 90శాతం కాంట్రాక్టు కార్మికులే ఉంటున్నారు. హమాలీలు మొదలుకొని భారీ పరిశ్రమల్లోని స్కిల్డ్‌ వర్కర్స్‌ వరకు వలస కార్మికులు అధికంగా ఉంటున్నారు. వీరంతా బీహార్‌, ఒరిస్సా, యూపీ, బెంగాల్‌, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రతో పాటు ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర వలస కార్మికులే ఉన్నారు. పురుషులతో పాటు మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతోంది. వీరందరి కోసం కాంట్రాక్ట్‌ లేబర్‌ యాక్ట్‌, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం ఉంది. వీరికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ, సెలవులు, బోనస్‌, గ్రాట్యూటీ ఇతర సౌకర్యాల్లేవీ అమలు కావడంలేదు. చట్టబద్ధమైన హక్కులు కూడా సరిగ్గా అమలు చేయడంలేదు.
రోజుకు 12 గంటల పాటు పని చేయించుకుంటున్నారు. ఓవర్‌ టైం వేతనాలు చెల్లించడంలేదు. అనేక భారీ పరిశ్రమల్లో కాంట్రాక్టు, క్యాజువల్‌, ట్రైనీలు, లాంగ్‌టర్మ్‌ ట్రైనీలు, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌, నీమ్‌, న్యాప్స్‌ న్యాట్స్‌ లాంటి అప్రెంటీస్‌ స్కీమ్‌ల ద్వారా నియమించబడిన కార్మికులను ఉత్పత్తిలో శాశ్వత కార్మికులతో సమానం గా పనిచేయిస్తూ శ్రమను దోచుకుంటున్నారు. వలస కార్మికులను కంపెనీల ఆవరణలో చిన్నపాటి గుడారాలు, గదుల్లో 10 నుంచి 20 మందిని పెట్టి కనీస సౌకర్యాలు లేకుండా బానిసల మాదిరి గొడ్డు చాకిరి చేయిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, లేబర్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్మికులు దోపిడీకి గురవుతున్నారు.
పెరగని కనీస వేతనాలు
కనీస వేతన చట్టం 1948 ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి ఐదేండ్లకోసారి వేతనాల్ని సవరించి పెంచాల్సి ఉంది. 2021 జూన్‌లో 5 రంగాలకు కనీస వేతనం రూ.18000లుగా నిర్ణయించి ఉన్నత అధికారులు ఇచ్చిన ఫైనల్‌ నోటిఫికేషన్లు కూడా గెజిట్‌ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు సార్లు కనీస వేతన సలహా మండలిని ఏర్పాటు చేసింది. కార్మికుల వేతనాలపై చర్చించిన ఆ మండలి అనేక సిఫార్సులు చేసింది. వాటిల్లో ఏ ఒక్క సిఫార్సునూ ప్రభుత్వం అమలు చేయలేదు. 8 గంటల పని విధానం కాకుండా 12 గంటల పాటు పనిచేయిస్తున్నారు. వార్షిక బోనస్‌ ఇవ్వడంలేదు. ఐదేండ్లు కంటిన్యూగా పనిచేస్తే సెమీ స్కిల్డ్‌ వేతనం ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా అమలు చేయడంలేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయంలేదు. 2023లో కరువు భత్యంతో కలిపి వివిధ పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత జీవోల ప్రకారం చెల్లించాల్సిన వేతనాలు కార్మికులకు అందని ద్రాక్షలా మారాయి.
కనీస వేతనం రూ.26 వేల కోసం పోరు
కనీస వేతనం రూ.26 వేలివ్వాలని సీఐటీయూ ఆనేక రూపాల్లో పోరాడుతోంది. ఇప్పటికే అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేశాం. ప్రభుత్వం పదేండ్ల కాలంలో ఒక్కసారి కూడా కనీస వేతనాల్ని సవరించలేదు. దీని వల్ల కోట్లాది మంది కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వేతనాలు సాధించుకునేందుకు ఈ నెల 4 నుంచి 13 వరకు పది రోజుల పాటు పారిశ్రామిక జిల్లాల్లో జీపుజాతా నిర్వహించనున్నాం. 17న 33 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నాం. కనీస వేతన సలహా మండలి చేసిన సిఫార్సుల్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.
జె.మల్లికార్జున్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు

Spread the love