పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం

–  దయనీయ స్థితిలో జీపీ కార్మికులు
– పాలకుర్తి నుంచి పట్నం వరకు పాదయాత్ర ప్రారంభం
– జెండాలకు అతీతంగా కలిసి రావాలి : గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయప్రతనిధి
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు అత్యంత దమనీయ స్థితిలో ఉన్నాయని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జనగామ జిల్లా పాలకుర్తి నుంచి పట్నం వరకు చేపట్టిన పాదయాత్ర ఆదివారం పాలకుర్తి రాజీవ్‌గాందీ చౌరస్తా నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు అధ్యక్షతన నిర్వహించిన సభలో భాస్కర్‌ పాల్గొని మాట్లాడారు. పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే గ్రామ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటూ మోసం చేస్తుందని, అందుకే పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నియోజక వర్గం నుంచే వారి సమస్యల పరిష్కారం కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అధికారం కోసం పాదయాత్రలు నిర్వహిస్తుంటే తాము మాత్రం కార్మికుల ఆకలి బాధలు తీర్చేందుకు చేపట్టినట్టు చెప్పారు. 500 జనాబాకు ఒకరి చొప్పున కార్మికులను నియమించి వారికి రూ 8500 వేతనం నిర్ణయించిందన్నారు. కాని ప్రభుత్వం జీఓ 51ని విడుదల చేసి అదనంగా ఉన్న కార్మికులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఒకరికి ఇచ్చే వేతనాన్నే అందరూ పంచుకోవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. వివిధ కేటగిరీలను రద్దు చేసి మల్టీపర్పస్‌ విధానానికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేటగిరీలను అమలు చేసి అర్హులైన కార్మికులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. అలాగే, మున్సిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్నట్టుగా గ్రామ పంచాయతీ కార్మికులకు జీఓ 60 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై బారాలు మోపుతుందన్నారు. మతాల పేరిట ప్రజల్లో చిచ్చుపెడుతుందని అరోపించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్లను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. జీఓ 60 ప్రకారం పారిశుద్య కార్మికులకు రూ 15.600 చెల్లించాలని, కోరోబార్‌, బిల్‌కలెక్టర్లకు రూ 19,500, కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ 22,700 చెల్లించాలని కోరారు. 2/94 యాక్ట్‌ను రద్దు చేసి పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలన్నారు. కారోబార్లకు, బిల్‌కలెక్టర్లకు స్పెషల్‌ కేటగిరీ కల్పించాలని తెలిపారు. వీరికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలూ అందించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని నిర్వహిస్తామని స్పష్టంచేశారు. జెండాలు, పార్టీలు పక్కన పెట్టి కార్మికుల సంక్షేమం కోసం అన్ని కార్మిక సంఘాలు ఈ పాదయాత్రలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుందని, 28న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బహిరంగసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. యాత్రలో సీఐటీయూ సీనియర్‌ నాయకులు రాజారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. రమ, పద్మశ్రీ, రాష్ట్ర నాయకులు డీజీ నర్సింగరావు, సోమన్న, సునీత, సుధాకర్‌, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గణపతి రెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర నాయకులు నారాయణ, నాయకులు మహేశ్‌, పి వినోద్‌ కుమార్‌రులు తదితరుల పాల్గొన్నారు.

Spread the love