దేశ స్వాతంత్య్రానికి ప్రతిబింబం మల్లు స్వరాజ్యం

– నిజాం సర్కార్‌ను గడగడలాడించిన వీర వనిత
– సాయుధ గెరిల్లా పోరాటంలో ఆమె కీలకం : బీవీ రాఘవులు
– నమ్మిన ఆశయం కోసం కొట్లాడిన వీరవనిత స్వరాజ్యం : మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవ తెలంగాణ-సూర్యాపేట
జాతీయోద్యమంలో భారతదేశానికి స్వరాజ్యం సాధించడంతో పాటు దేశ స్వాతంత్య్రానికి మల్లు స్వరాజ్యం ప్రతిబింబం అని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మండలం రాయినిగూడెం గ్రామంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ అధ్యక్షతన జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మల్లు స్వరాజ్యం ఈ తరానికి ఒక స్ఫూర్తి అని, ఆమె పోరాటం అందరికీ ఆదర్శం అని, తుపాకీ పట్టి నిజాంను గడగడలాడించిన వీరవనిత అని కొనియాడారు. ఆడవాళ్ళు అబలలు కాదు సభలలు అని నిరూపించిన యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. కాగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం దుర్మార్గంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మత పోరాటంగా చిత్రీకరిస్తుందని విమర్శించారు. ఇది ఆనాటి అమర వీరుల త్యాగానికి ద్రోహం చేసినట్టేనని బీజేపీపై మండిపడ్డారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం అయిన లౌకితత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ మత సామరస్యాన్ని చెడగొట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలన్న శక్తులను అడ్డుకోవడానికి లౌకికవాద శక్తులు, రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి బీజేపీ ప్రమాదకరమైతే అత్యంత ప్రమాదకరం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమ న్నారు. నమ్మిన ఆశయం కోసం కొట్లాడిన వీరవనిత స్వరాజ్యం అని, ఆమె ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గాలను, అరాచకాలను ఎదిరించడంలో ఆమె చూపిన తెగువ ఎనలేనిదని కొనియాడారు. నేటి యువతరానికి ఆమె లాంటి యోధుల జీవితాలు స్పూర్తి అన్నారు. కానీ నేటి తరం యువతను చూస్తే బాధ అనిపిస్తుందన్న మంత్రి అనవసరమైన టెక్నాలజీ మోజులో పడి రాజకీయాలకు దూరమవ్వడమే కాకుండా ప్రశ్నించే మనస్తత్వాన్ని కూడా కోల్పోతున్నారని వాపోయారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక అభివృద్ధి సూచిలో దేశం మరింతగా దిగజారిందని తెలిపారు. కేవలం అదానీ, అంబానీల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికి స్ఫూరి ్తదాయకమైన వ్యక్తి అన్నారు. తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. తెలంగాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళగా కీర్తి గడించారని, మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేలు బహుమతి ఇస్తామని ఆనాడు ప్రకటించడమంటే ఎంత గొప్పగా పోరాడారో అర్థమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, చెరుపల్లి సీతారాములు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమళ్ళ అన్నపూర్ణ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, స్వరాజ్యం కూతురు పాదురి కరుణ, పార్టీ జిల్లా నాయకులు, మల్లు స్వరాజ్యం కుటుంబసభ్యులు మల్లు అరుణ్‌, మల్లు ఆధిత్య, పాదూరి శశి తదితరులు పాల్గొన్నారు.

Spread the love