రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ

– మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఉండవు
– బీసీ జనాభా గణనకు కేంద్రం మోకాలడ్డు
– పోడు భూములకు, నివేశన స్థలాలకు పట్టాలివ్వాలి : ములుగు జాతాలో తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రానికి చేరిన జనచైతన్య యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభకు పార్టీ మండల కార్యదర్శి అమ్జద్‌ పాషా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని, మళ్లీ అధికారంలోకి వస్తే దేశం దేశంలా వుండదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సామాజిక న్యాయం కొరవడుతున్నదన్నారు. రిజర్వేషన్లను ఎత్తేస్తారన్నారు. బీజేపీ మతోన్మాద ప్రమాదంపై ప్రజలను చైతన్యపరచడానికి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దింపడానికే 33 జిల్లాల్లో సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగంలోని మౌలిక అంశాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పక్కనపెడుతోందన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. బీజేపీ హిందువుల పార్టీ అనుకుంటే పొరపాటేనన్నారు. హిందూ మతంలో 6 వేల కులాలున్నాయని, వీటిలోనూ అసమానతలున్నాయన్నారు. కుల, మతాలను రెచ్చకొట్టి పబ్బంగడుపుకుం టుందన్నారు. కుల, మతాలు లేని దేశం కావాలని కమ్యూనిస్టు పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రజలంతా సమానంగా వుండే సమాజం సాధించాలనేదే కమ్యూనిస్టుల ప్రయత్నమన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుల వ్యవస్థ వుండాలని కోరుతున్నాయని చెప్పారు. ఏ కులం వాళ్లు ఆ పనులే చేయాలని చెబుతున్నారన్నారు. కుల వ్యవస్థను సమర్థిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గోల్వాల్కర్‌, హెడ్గేవార్‌ పలు పుస్తకాలు రాశారన్నారు. వీరు రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని అమలు చేయాలని చెప్పారని విమర్శించారు. దేశంలో బీసీ జనాభా గణన జరగలేదన్నారు. బీసీ జనాభా గణన చేపట్టాలని పార్లమెంటులో ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నా ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదన్నారు. బీసీ జనాభా గణన జరిగితే పెత్తందారులకు అవకాశాలు తగ్గుతాయనే మోకాలడ్డుతున్నారని విమర్శించారు. బీసీ జనాభా గణన చేసే ఉద్దేశం లేదని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. విద్యుత్‌ రంగంలో సబ్సిడీలను ఎత్తేసే కార్యక్రమాన్ని మోడీ అమలు చేయబోతున్నారని చెప్పారు. 2022లో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానన్న ప్రధాని మోడీ ఉన్న ఆదాయాన్ని తగ్గించేశారన్నారు. మార్కెట్‌లే లేకుండా చేసే విధంగా వ్యవసాయ బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తే దేశ వ్యాప్తంగా రైతాంగం ఉద్య మించడంతో తోకము డిచారన్నారు. బీజేపీ పాలనలో మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తన పాలనలోని లోపాలను సరిదిద్దుకోవాలని తమ్మినేని సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా.. బలంగా నిలబడుతున్న సీఎంకు మద్దతివ్వాల్సిన అవసరముందన్నారు. అలా అని పోడు భూములకు, నివేశన స్థలాలకు పట్టాలివ్వకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి ఇవ్వడంలో విఫలమయ్యారని, వెంటనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలన్నారు. నివేశన స్థలాలు కోటి మందికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సొంత స్థలం వున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. కోటి మందికి నివేశన స్థలాలు ఇవ్వకపోతే పోరాటం తప్పదన్నారు. 2006లో పోడు భూముల చట్టం వచ్చిందని, ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు. వెంటనే ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌ సీపీఐ(ఎం), సీపీఐ మద్దతు అడిగారని, బీజేపీని ఓడించడానికి బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని చెప్పారు.
ములుగు జిల్లా వ్యాప్తంగా నీరివ్వాలి : వెంకట్‌రెడ్డి
పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి మాట్లా డుతూ.. పోడు భూములకు పట్టాలిస్తామని నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, వెంటనే పట్టాలివ్వాలన్నారు. ములుగులో గతంలో పేదలకు ఇచ్చిన నివేశన స్థలాల పట్టాలను లాక్కున్నారన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబం ధించి భూమి ఇచ్చిన నిర్వాసితులు 60 మందికి నేటికీ నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలోనే వున్న ములుగు జిల్లా వ్యాప్తంగా సాగునీరు ఇవ్వాలన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి క్రిష్ణారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాంబశివ, మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గునిగంటి రాజన్న, సూర్నపు సోమయ్య, సీపీఐ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్‌, సీపీఐ(ఎం) నాయకులు ఎండి గఫూర్‌, కోట రమేశ్‌, అల్వాల వీరయ్య, రవీందర్‌ పాల్గొన్నారు.
బైక్‌ర్యాలీ
జనచైతన్య యాత్రలో బైక్‌ ర్యాలీ స్థానికులను ఆకట్టుకుంది. రెడ్‌ షర్ట్స్‌ ధరించి యాత్రకు ముందు యువకులంతా బైక్‌లపై యాత్రకు స్వాగతం పలుకుతూ సభాస్థలికి చేరు కున్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో బస చేసిన నేతలు శనివారం ఉదయం బయలుదేరి మధ్యాహ్నాం 12.20 గంటలకు ములుగు చేరుకుంది.

Spread the love