– భద్రాచలం బాగోగులు పట్టని బీజేపీ
– భద్రాద్రి మునగాల్సిందేనా?
– పోలవరం పూర్తయితే భద్రాద్రి భద్రతకు ముప్పు
– సంయుక్త సర్వేపై కేంద్రప్రభుత్వ మీనమేషాలు
– కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి (కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి)
భద్రాచలం బాగోగులు మోడీ అండ్‌ కోకు పట్టవా? ఒకవేళ పడితే పోలవరం ఎత్తుతో గోదారి ముంపులో భద్రాద్రి కొట్టుకుపోతున్నా ఎందుకు స్పందించరూ… అంటే వారికి శ్రీరాముడి కన్నా ఆయన్ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడమే మిన్న.. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేనా భద్రాద్రి రామాలయం ముస్లిం రాజు హయాంలో నిర్మించారు కాబట్టి అనే కుట్రకోణం ఏమైనా దాగుందా.. అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. పోలవరం ఎత్తుతో గోదావరి ముంపులో భద్రాచలం, దాని పరిసరాలు నామరూపాలు లేకుండా పోతాయని.. గతేడాది వరదలే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నా కేంద్రం మాత్రం ఈ నేలపై వివక్షనే చూపుతోంది. పోలవరం ఎత్తు.. భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం ముంపుపై తెలంగాణ, అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోసారి సంయుక్త సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. కానీ అది ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.
సాగని సంయుక్త సర్వే…
పోలవరం ప్రాజెక్టు కనీస నీటిమట్టం 41.15 మీటర్ల నుంచి 38.05 మీటర్లకు తగ్గించడంపై కేంద్రజలశక్తి శాఖ కొన్ని నెలల కిందట అధ్యయనం చేసింది. ఎంత మేర తగ్గిస్తే ముంపు నివారించవచ్చనే దానిపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పీపీఏలతో సంప్రదింపులు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పోలవరం ముంపుపై ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిరోజుల క్రితం సంయుక్త సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరిలో పలు విడతల్లో నిర్వహించిన సమావేశాల్లో ఈ మేరకు ఏపీని
ఆదేశించారు. ముంపు ప్రాంతాలతో పాటు గోదావరి పరీవాహకంలోని వాగులపై సమగ్ర సర్వే చేయాలని సూచించారు. సీడబ్ల్యూసీ అధికారులు ఆదేశించినా సర్వేపై ఇంత వరకు స్థానిక అధికారులకు సమాచారం అందలేదు. మరో రెండున్నర నెలల్లో వర్షాకాలం సమీపిస్తుంది. ఇంతవరకూ ఎప్పుడు సర్వే చేస్తారు.. ఏ అంశాల ప్రాతిపదికన చేస్తారనేది స్పష్టత లేదు.
ఎన్నాళ్లీ ముంపు భయం..?
కేంద్రం గోదావరి ముంపుపై ఓ నిర్ణయాన్ని తీసుకోవడంలో తాత్సారం చేస్తుండటం పరీవాహక వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. నదికి ఓవైపున ఉన్న భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, మరోవైపున ఉన్న బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల ప్రజల్లో భయాందోళనలు వీడటం లేదు. పోలవరం ప్రభావంతోనే ముంపు ముంచెత్తుతోందని స్థానికులు భావిస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వ ఉంటే కొద్దిపాటి వర్షాలు వచ్చినా తమ పరిస్థితి ఏంటని భయాందోళనకు గురవుతున్నారు. తిరుగు జలాల ప్రభావం కచ్చితంగా ఉంటుందంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరంతో తెలంగాణలో ముంపు లేదని వాదిస్తోంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముంపు ఆధారాలను అందజేసినా కేంద్రం మాత్రం పట్టనట్టే ఉంటోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ప్రభుత్వాలు సైతం తెలంగాణకు ఈ విషయంలో మద్దతు ఇస్తున్నా.. కేంద్రం వైపు నుంచి సానుకూలత లేదు. గతేడాది వరదలకు భద్రాచలంలోని దాదాపు అన్ని కాలనీలు నీటిమయం అయ్యాయి. రామాలయ పరిసరాల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో తెప్పలపై ప్రయాణం చేసిన దృశ్యాలు కండ్ల ముందే కదలాడుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట చేలు నీటమునిగాయి. ఇండ్లు నేలమట్టమయ్యాయి. జనజీవనం నెలల తరబడి స్తంభించింది. అయినా కేంద్రం వైపు నుంచి పైసా సహాయ సహకారం అందలేదు. భద్రాద్రి ఆలయ భవిష్యత్తుకు కూడా పోలవరం ఎత్తుతో ముప్పు తప్పదంటున్నా.. రామభక్తులమని చెప్పుకునే కాషాయ ప్రభుత్వం నుంచి స్పందన లేదనే విమర్శలున్నాయి.
పోలవరం ముంపుపై ఇప్పటికైనా శాస్త్రీయంగా సర్వే చేయాలి..
పోలవరం ముంపు విషయంలో శాస్త్రీయంగా సర్వే చేయలేదు. కాఫర్‌ డ్యాం ఎత్తు తగ్గించాలి. లేదంటే భద్రాచలం పరిసరాల్లో ముంపు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గతేడాది ముంపు పరిస్థితులు గుర్తొస్తేనే జనం భయాందోళనకు గురవుతున్నారు. భద్రాద్రి పరీవాహక ప్రాంతాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పోరాడుతోంది. కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం సరికాదు.
– రేగా కాంతారావు,
తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే
ముంపు సమస్య పరిష్కారంలో
కేంద్రం నిర్లక్ష్యం
రెండు తెలుగు ప్రభుత్వాలను సమన్వయం చేసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలనైనా తెలంగాణకు ఇస్తే కొంత వరకు సమస్య పరిష్కారం అవుతుంది. దీని ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదు. సంయుక్త సర్వే అంశాన్నీ సీడబ్ల్యూసీ నిర్లక్ష్యం చేస్తోంది.
– మచ్చ వెంకటేశ్వర్లు,
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు

Spread the love