– ఈ నెల 15 నాటికి తెలంగాణకు!
– వారం పాటు ఎండలు, వడగాల్పులే
– అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు గురు, శుక్రవారాల్లో కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 15 వరకు అవి తెలంగాణకు తాకే అవకాశముందని తెలిపింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియల్ కర్నాటక వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితి అట్లాగే కొనసాగుతున్నది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. మరోవైపు కొన్న ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదయ్యే అవకాశముంది. అదే సమయం లో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 130కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగలగిద్దెలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. 25 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.
తంగుల(కరీంనగర్) 45.8 డిగ్రీలు
మేడారం(ములుగు) 45.5 డిగ్రీలు
దామరచర్ల(నల్లగొండ) 45.3 డిగ్రీలు
మునగాల(సూర్యాపేట) 45.1 డిగ్రీలు
మహదేవపూర్(జయశంకర్) 45.1 డిగ్రీలు