అచ్ఛేదిన్‌ కాదు.. చచ్చేదిన్‌…

– ఎనిమిదిన్నరేండ్ల మోడీ పాలనలో ధరలు ఆకాశానికి 
– ప్రజల ఆదాయాలు పాతాళానికి
– వంట గ్యాస్‌ ధర రూ.399 నుంచి రూ.1,150కి ఎగబాకిన వైనం
– లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.71 నుంచి రూ.109కి…
– ఉప్పు, పప్పులతో సహా అన్ని రేట్లదీ అదే తీరు
బివిఎన్‌ పద్మరాజు
దేశానికి అచ్ఛేదిన్‌ (మంచి రోజులు) తీసుకొస్తామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏలుబడిలో పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అచ్ఛేదిన్‌ మాటేమోగానీ… ఇప్పుడు జనాలకు చచ్చేదిన్‌ దాపురించాయి. ఘనత వహించిన ప్రధాని మోడీ ఎనిమిదిన్నరేండ్ల పాలనలో కాదేదీ పెంపునకు అనర్హమన్నట్టు… ఉప్పు, పప్పులు, నూనెలు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను పెంచేసి ప్రజల నడ్డి విరిచారు. కరోనాతో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి నడి రోడ్డులో నిలబడ్డ జనానికి… పెరిగిన ధరలు మరింత పెనుభారంగా మారాయి. వంట గ్యాస్‌తోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరగటంతో వాటి ప్రభావం సరుకు రవాణాపై పడి, ఇటు కూరగాయలు, అటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.
వంటింట్లో మంటలు
నేడు పెరిగిన వంట గ్యాస్‌ ధర వంటింట్లో మంటలు పెడుతున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు 2011లో రూ.399.26 ఉన్న గ్యాస్‌ (14.2 కిలోలు) ధర 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.414కు పెరిగింది. ఆ తర్వాత 2015లో దాని ధర రూ.452కు ఎగబాకింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా బాదుడు మీద బాదుడు బాదటంతో ఇప్పుడు ఏకంగా రూ.1,150కి చేరింది.ఇది చాలదన్నట్టు ఇతరత్రా అనేక ఫీజులు, రుసుముల రూపంలో కూడా సర్కారు తాను వడ్డించదలుచుకున్న వాటిని యధేచ్ఛగా వడ్డిస్తూ పోతున్నది. ఉదాహరణకు రైల్వే టిక్కెట్లను రద్దు చేసుకున్న సందర్భంలో ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన ఫీజు రూ.2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.352 కోట్లుగా నమోదైతే… 2021-22లో మరింత పెరిగి రూ.694 కోట్లుగా నమోదైంది. 2022-23లో ఆ రూపంలోనూ ఫీజు రూ.604 కోట్లుగా నమోదవటం గమనార్హం. ఈ రకంగా బాదుతుంటే..సామాన్యుడి జీవితం ఏంగానూ…?
2014 నుంచి ఇప్పటి వరకూ
పెరిగిన ధరలు… (రూ.లలో)
వస్తువు 2014లో ప్రస్తుతం పెరిగిన
ధర శాతంలో
వంటగ్యాస్‌ 399 1,150 185
పెట్రోల్‌ (లీటర్‌) 71 109 53
డీజిల్‌ (లీటర్‌) 55 97 76
బియ్యం (కిలో) 27 55 103
వంటనూనె (కిలో) 83 165 98
ఉల్లిగడ్డలు (కిలో) 10 30 200
గోధుమపిండి (కిలో) 22 62 181
ఉప్పు (కిలో) 10 22 120
చక్కెర (కిలో) 24 42 75
పాలు (లీటర్‌) 38 64 68
ఆలుగడ్డలు (కిలో) 18 35 94
ఛారుపత్తా (కిలో) 194 320 65
చింతపండు (కిలో) 40 120 200
కందిపప్పు (కిలో) 50 118 136
మినపప్పు (కిలో) 32 106 231
శనగపప్పు (కిలో) 24 70 191
అరటిపండ్లు (డజను) 33 55 66
గుడ్లు (డజను) 38 75 98
78 సార్లు పెట్రోల్‌.. 76 సార్లు డీజిల్‌
మోడీ హయాంలో ధరా ఘాతం ఎంతగా ఉందనే దానికి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్క 2021లోనే 78 సార్లు పెట్రోల్‌ ధరలు, 76 సార్లు డీజిల్‌ ధరలు పెరిగాయి. ఆ ఒక్క ఏడాదే కాదు అంతకుముందు, ఆ తర్వాత కూడా ఇష్టారీతిన పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుకుంటూ పోయారు. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా ప్రతీరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మార్చుకునేందుకు వీలుగా 2017 నుంచి దేశంలో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌ పాలసీ’ని అమలు చేయటం వల్ల వాటి ధరలు విపరీతంగా పెరిగి జనం జేబులను గుల్ల చేస్తున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన సందర్భంలో సైతం దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘పెంచుడే తప్ప తగ్గించుడు లేదు…’ అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తుండటం గమనార్హం. అయితే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల జరిగిన సందర్భాల్లో మాత్రం నామ్‌ కే వాస్తేగా ఏడెనిమిది సార్లు తగ్గించి… ఆ తర్వాత 70, 80 సార్లు పెంచుకుంటూ పోయారు. ఇదీ మోడీ సర్కార్‌ మేజిక్కు.

Spread the love