ఎవరున్నా వదిలిపెట్టం.. కఠినంగా శిక్షిస్తాం

– పేపర్‌ లీకేజీలో బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పేపర్‌ లీకేజీ కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న రాజశేఖర్‌ రెడ్డి వెనుకాల ఎవ్వరున్నా వదిలేది లేదనీ, కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్‌ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పే గానీ.. సంస్థాగత వైఫల్యం కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ” రాజశేఖర్‌ రెడ్డి బీజేపీ క్రియాశీలక కార్యకర్త. ఆయన వెనుకాల ఎవరైనా ఉన్నారా..? ఏదైనా కుట్రకోణం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరాం. నిరాధారంగా మాట్లా డటం లేదు. బీజేపీ కార్యకలాపాల్లో రాజశేఖర్‌ రెడ్డి పాల్గొంటున్నారు. ఆ పార్టీ కి అనుకూలంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అలాంటి వ్యక్తి దీని వెనుకాల ఉన్నాడంటే మాకు చాలా అనుమానం ఉంది….” అని కేటీఆర్‌ తెలిపారు. ” ఇలా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ పోతుంటే దాన్ని కుట్ర అని బండి సంజరు అన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి మా దగ్గరికి రాకుండా కుట్ర చేస్తున్నారని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్లు ఇవ్వడం, పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం కుట్ర అని మాట్లాడుతున్న సంజరు పార్టీకి చెందిన వ్యక్తే ఏ2గా దొరికాడు.
దీని వెనుకాల ఏదైనా కుట్ర కోణం ఉందా?
ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందా..? అప్రతిష్టపాలు చేయాలనే కుట్ర ఏమైనా ఉందా..? అనే అంశాలపై విచారణ జరిపించాలని డీజీపీని కోరాం. పేపర్‌ లీక్‌ వెనుకాల బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. వెయ్యికి వెయ్యి శాతం వందకు వంద శాతం తప్పకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం..” అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు అని ఆయా రాజకీయ పార్టీలకు కేటీఆర్‌ ఈ సందర్భంగా సూచిం చారు. రాజకీయాల్లో విజయాలు, ఓటములు సర్వసాధారణం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. ‘ మంచేదో… చెడోదో ప్రజలకు తెలుసు. మీ వ్యాఖ్యానాల వల్ల సున్నిత మనస్కు లైన పిల్లలను ఇబ్బంది పెట్టొద్దు … ‘ అని కేటీఆర్‌ ప్రతిపక్షాలకు సూచించారు. కమిషన్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో పరీక్షలు.. మళ్లీ ఫీజు చెల్లించక్కర్లేదు..
”టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు చేయాల్సిన మార్పులను చేస్తాం. నాలుగు పరీక్షలు రద్దయ్యాయి. ఈ పరీక్షల ను రాసే విద్యార్థులు ఎవరూ ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారెవరూ ఫీజు చెల్లించనక్కర్లేదు. మార్పులు తీసుకొచ్చి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో ధరఖాస్తు చేసుకున్న వారంతా పరీక్ష రాసేందుకు అర్హులే. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి కోచింగ్‌ మెటీరియల్‌ అంతా ఆన్‌లైన్లో పెడతాం. ఉచితంగా మెటీరియల్‌ ఇచ్చే బాధ్యత మాది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. రీడింగ్‌ రూమ్‌లను సైతం 24 గంటలూ తెరిచే ఉంచాలని నిర్ణయించాం. ఉచిత మెటీరియల్‌తో పాటు ఉచిత భోజన వసతి కూడా అందిస్తాం. ఆయా జిల్లాల కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి సహకరిస్తాం” అని కేటీఆర్‌ వివరించారు.
రాజకీయ నిరుద్యోగుల మాటలు పట్టించుకోవద్దు
తెలంగాణ యువత రాజకీయాలకు అతీతంగా గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పాల్గొన్నదని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఎనిమిదేండ్లుగా టీఎస్‌పీఎస్సీ ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు. చిన్న లోపం తలెత్తినా సరిదిద్దుకొనే సంస్కారం తమకు ఉందన్నారు. అపోహలు సృష్టించే వారిని విశ్వసించవద్దని కోరారు. దేశంలోనే అత్యుత్తమ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లలో ఒకటిగా టీఎస్‌పీఎస్సీ పేరుగాంచిందని మంత్రి తెలిపారు. ఎన్నో రకాల సంస్కరణలు, మార్పులు, కాలానుగుణంగా సాంకేతికతను జోడించి కీలక నిర్ణయాలతో ముందుకెళ్తోందన్నారు. ఎలాంటి అనుమానాలు రావొద్దనే పరీక్షలు రద్దు చేశాం. క్వాలిఫై అయిన వాళ్లు పెద్ద మనుసుతో అర్థం చేసుకోవాలని కోరారు. అపోహలు, అనుమానాలు, దుష్ప్రచాలు నమ్మొద్దని సూచించారు. సిట్‌ విచారణ పూర్తయితే అన్ని విషయాలూ బయటకు వస్తాయని ఆయన చెప్పారు.
అక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామా చేశారా?
ఐటీశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ మంత్రికి, లీకేజీకి ఏం సంబంధం? రాష్ట్రంలో కంప్యూటర్లన్నింటికీ నేను బాధ్యుడినా? బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌ లో 13 సార్లు పేపర్‌ లీకైంది. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు వచ్చాయి. అస్సాంలో పోలీసు పరీక్ష పేపర్‌ లీకైంది. అక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామా చేశారా? అని కేటీఆర్‌ ఎదురు ప్రశ్నించారు. రాజకీయాల కోసం బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Spread the love