– అతడి గెలుపుకోసం అందరూ కృషి చేయాల్సిందే…
– తేల్చి చెప్పిన మంత్రి కేటీఆర్
– 21న సీట్ల ప్రకటన నేపథ్యంలోఅమెరికా ఫ్లయిటెక్కిన వర్కింగ్ ప్రెసిడెంట్
– అలకలు, నిరసనలకు దూరంగా ఉండేందుకే..
– వారం రోజుల పాటు విదేశీ టూర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో సిట్టింగుల సీటుకు ఎసరొస్తుందనే కారణంతో నిరసనలకు దిగిన అసంతృప్తులకు మంత్రి కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీట్ల సిగపట్లతోపాటు వాటి కోసం పైరవీలు చేయొద్దంటూ నేతలకు హితవు పలికారు. అందుకు భిన్నంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ‘ఏ నియోజకవర్గానికైనా ఒకటే బీ-ఫామ్, ఒక్కరే అభ్యర్థి ఉంటారు. అతడి గెలుపుకోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి…’ అంటూ ఆయన ఆదేశించారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో ఆ నియోజవర్గానికి చెందిన వుప్పల వెంకటేశ్ తదితరులు శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో వారికి గులాబీ కండువా కప్పిన కేటీఆర్… ఆ సందర్భంగా అసంతృప్తులకు చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. వెంకటేశ్‌కు భవిష్యత్తులో పెద్ద పదవినిస్తామని చెప్పారు. మరోవైపు సోమవారం బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటికే రగులుతున్న అసంతృప్తులు, అలకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. టిక్కెట్ దక్కని నేతలు, చివరి ప్రయత్నంగా హైదరాబాద్‌కు వచ్చి తనను కలిసి మొరపెట్టుకునే అవకాశమున్న క్రమంలో ఒకరిని ఎక్కువ చేసి, ఒకరిని తక్కువ చేస్తే లేని పోని తలనొప్పులు ఎదురయ్యే అవకాశముందని ఆయన భావించినట్టు సమాచారం. అందుకే ఆయన వారం రోజులపాటు అమెరికాలో ఉండేందుకు వీలుగా శనివారం సాయంత్రమే విమానమెక్కారు. ఈలోగా పరిస్థితి చక్కబడుతుంది కాబట్టి, అప్పుడు వచ్చినా ఇబ్బంది ఉండబోదనే అంచనాతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
కాగా ‘మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కోసం శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. సుమారు వారం రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో పలు పెట్టుబడి సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను, బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌ను ఇప్పటికే పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులు ఖరారు చేశారు. ఇందులో భాగంగా న్యూయార్క్, చికాగో వంటి పలు నగరాల్లో మంత్రి కేటీఆర్ వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీలతో సమావేశం అవుతారు. ఆయనతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖకు సంబంధించిన పలు విభాగాల డైరెక్టర్లు కూడా ఈ పర్యటనలో భాగస్వాములు కానున్నారు. ఒకవైపు తన పర్యటన తొలి అంకంలో విస్తతంగా పెట్టుబడి సమావేశాలకు హాజరు కావడంతోపాటు పర్యటన చివరి అంకంలో తన కుమారుడు హిమాన్షు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమానికి కూడా మంత్రి హాజరవుతారు. ఇప్పటికే హిమాన్షుకు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు అయింది. ఇందుకు సంబంధించిన కోర్సు జాయినింగ్ కార్యక్రమంలో కేటీఆర్ కుటుంబం హాజరు కానున్నది…’ అని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
ట్రైలర్ మాత్రమే చూసిండ్రు.. ఇక సినిమా చూపిస్తాం
ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
మరోవైపు కల్వకుర్తి నేతల చేరికల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు అయింది. ఇన్నేండ్లలో గత ప్రభుత్వాలు ఇంటింటికి నీళ్లు, రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు..?’ అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కాబట్టి… ప్రతిపక్ష నేతలు నోటికొచ్చిన హామీలను గుప్పిస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకూ ఆయా పార్టీలు రూ.4 వేల పింఛన్‌ను, 24 గంటల కరెంటును ఎందుకివ్వలేకపోయాయని ఎద్దేవా చేశారు.
ఒకాయనేమో ఒక్క ఛాన్స్ ఇవ్వడంటూ అడుక్కుంటున్నాడు.. ఇంకో బీజేపీ నాయకుడేమో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలను కూడా అమలు చేస్తామని చెబుతున్నాడు…కేసీఆర్ పథకాలను అమలు చేయటానికైతే మీరెందుకు అధికారంలోకి రావాలంటూ విమర్శించారు. సంపదను పెంచాలి, పేదలకు పంచాలనేది తమ పార్టీ విధానమని తెలిపారు. అందుకు భిన్నంగా సంపద పెంచుకుని.. వెనకేసుకోవాలనేది విపక్షాల తీరని విమర్శించారు. ‘గతంలో సంచులు మోసిన వాడు కూడా ఇప్పుడు నీతులు చెబుతున్నాడు…’ అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పీఠం అనేది ఒక పదవా..? అదేదో ప్రధానమంత్రి పదవైనట్టు ఆయన బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామంటూ నమ్మబలికిన ప్రధాని మోడీ ఆ హామీని తుంగలో తొక్కారని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టటమే బీజేపీ విధానమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ గతంలో కేసీఆర్‌ను జైలుకు పంపుతామంటూ కేకలేసి… ఇప్పుడు తానే షెడ్డు లోకి పోయారని బండి సంజరును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌గానీ, బీజేపీగానీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అందువల్ల బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆదరించి అక్కున చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగిరీకి మధ్య జరగబోయే ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు.