ఒక్కసారి…

– వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాక కోసం నేతల ఎదురు చూపులు
– కేటీఆర్‌ వస్తే టిక్కెట్‌ ఖాయమన్న ధీమా
– అసంతృప్తులూ చల్లారతాయనే ఆశతో ఎమ్మెల్యేలు 
– మా నియోజకవర్గానికి రండి ప్లీజ్‌..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శాసనసభకు ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ… బీఆర్‌ఎస్‌ సిట్టింగులు, ఆశావహులు వారి వారి ప్రయత్నాలను తీవ్రం చేస్తున్నారు. ఉన్న సీటును కాపాడుకునేందుకు ప్రస్తుత ఎమ్మెల్యేలు, నూతనంగా పోటీ చేసేందుకు కొత్త వారు… అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు. మరోవైపు తమ తమ నియోజకవర్గాల్లో ఎవరితో ప్రచారం చేయిస్తే ఊపూ, ఉత్సాహం వస్తాయో బేరీజు వేసుకుని మరీ వారిని రప్పించేందుకు తహతహలాడుతున్నారు. గులాబీ బాస్‌ కేసీఆర్‌ పాలన, సమీక్షలు తదితర పనుల్లో బిజీగా ఉంటారు.. పైగా తాము రమ్మన్న చోటుకి ఆయన వస్తారో లేదోననే భయంతో నేతలు దళపతిని అడిగేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను తమ తమ నియోజవర్గాల్లో తిప్పితే అన్ని రకాలుగా మేలని వారు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వారు ఆయన్ను రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
కేటీఆర్‌ను నియోజకవర్గాల్లో తిప్పితే రెండు రకాల ప్రయోజనముంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వీటిలో ఒకటి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఆయన తమ తమ ప్రాంతాల్లో పర్యటిస్తే… సీటు కచ్చితంగా తమకే వస్తుందనే సంకేతాలను ఇవ్వొచ్చు. ఆ రకంగా తమ చుట్టూ ఉన్న క్యాడర్‌ను సంతృప్తి పరిచి, వారిలో ఉత్సాహాన్ని నింపొచ్చు. ఇక రెండోది ఎవరైనా తమకు పోటీగా బరిలోకి దిగే అవకాశాలు, రెబల్‌గా పోటీ చేసే ప్రమాదాలు ఉంటే అలాంటి వారిని కేటీఆర్‌తో మాట్లాడించటం, సంప్రదింపులు జరపటం ద్వారా ఆయా అసంతృప్తులకు ఆదిలోనే చెక్‌ పెట్టొచ్చని నేతలు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఎలాగైనా తమ తమ నియోజకవర్గాలకు రప్పించేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న నియోజకవర్గాలు.. వాటితోపాటు ఇటీవల ఆ పార్టీ బలం పుంజుకున్నదని భావిస్తున్న స్థానాల్లోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. ఆయన పర్యటన ఖరారైతే ఆ సందర్భంగా కాంగ్రెస్‌ గత వైఫల్యాలపైనా, ప్రస్తుత బలహీనతలపైనా మాట్లాడించేందుకు వారు యోచిస్తున్నారు. దాంతోపాటు స్థానిక కాంగ్రెస్‌ నేతల లొసుగులపైనా కేటీఆర్‌తో విమర్శనాస్త్రాలు సంధింపజేయటం ద్వారా హస్తం పార్టీ నాయకులపై తాము పైచేయి సాధించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే కేటీఆర్‌ వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నట్టు సమాచారం.

Spread the love